చైనా మెగా డ్యామ్‌కు భారత్ మాస్టర్ స్ట్రోక్.. అరుణాచల్‌లో 'సీయాంగ్' ప్రాజెక్ట్
టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న 60 వేల మెగావాట్ల సామర్థ్యంగల ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును భారత్ వ్యూహాత్మకంగా తిప్పికొడుతోంది. చైనా చర్యలతో ఈశాన్య భారతదేశ ప్రజలకు నీటి కరవు రాకుండా ఉండేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని సీయాంగ్ నదిపై 'సీయాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్' ను నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ద్వారా వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. టిబెట్ లో బ్రహ్మపుత్ర నదిని 'యార్లుంగ్ సాంగ్పో' అంటారు.
రూ.1.5 లక్షల కోట్ల వ్యయం
సుమారు రూ. 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా 11 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. దాదాపు 300 మీటర్ల ఎత్తుతో రూపుదిద్దుకోనున్న ఈ డ్యామ్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం సుమారు 9 బిలియన్ క్యూబిక్ మీటర్లు.. అంటే 320 టీఎంసీలు. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాక, ఈశాన్య భారత్‌లో వరద నియంత్రణ, వ్యూహాత్మక రక్షణ కోసం అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ బఫర్‌గా ఉపయోగపడనుంది.
చైనాకు పై ఎత్తు
ఒకవేళ వర్షాకాలంలో చైనా అకస్మాత్తుగా నీటిని వదిలినా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లు మునిగిపోకుండా ఈ రిజర్వాయర్ నిరోధిస్తుంది. అలాగే ఎగువన చైనా నీటిని ఆపేస్తే, దిగువ ప్రాంతాలకు నీటి కొరత రాకుండా క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాక, అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం ఒక నదిపై దిగువన ఉన్న దేశం ముందే నీటిని వినియోగించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే, ఎగువన ఉన్న చైనా ఏకపక్షంగా నీటిని మళ్లించకుండా చట్టపరంగా నిరోధించే అవకాశం భారత్‌కు లభిస్తుంది.

సవాళ్లను అధిగమించి
అయితే, ఈ ప్రాజెక్ట్ సాధనలో భారత్‌కు కొన్ని కీలక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అత్యంత భూకంప ప్రమాదం ఉన్న 'సిస్మిక్ జోన్-5' లో ఉండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ ప్రాజెక్ట్ వల్ల తమ భూములు, సంస్కృతి నీట మునుగుతాయనే భయంతో స్థానిక 'ఆది', 'గాలో' గిరిజన తెగలు, స్వచ్ఛంద సంస్థలు ఈ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సరిహద్దు జల భద్రతను కాపాడుకోవడానికి, చైనా జల ఆధిపత్యానికి విరుగుడుగా ఈ ప్రాజెక్ట్ భారత్‌కు అత్యంత కీలకమైన రక్షణ కవచంగా మారనుంది.












Click it and Unblock the Notifications