పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి.. చుక్కలు చూపిస్తున్న భారత్..!
గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోయలోని పహల్గామ్ లో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.
భారత్ సైన్యం ధ్వంసం చేసిన వాటిల్లో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లు ఉన్నాయి. అలాగే పాకిస్థాన్ పై భారత్ కఠినమైన ఆంక్షలను అమలు చేసింది. వాటిల్లో సింధూ జలాల అమలు ఒకటి.
భారత్ నుంచి పాకిస్థాన్ కు జలాలను తరలించే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని వెల్లడించింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ తన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకుంది. అయితే సింధూ నది జలాలను విడుదల చేయాలని పాకిస్థాన్ పట్టుబడుతోంది. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టేంత వరకూ సింధూ జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా భారత్ మరోసారి సింధూ నది జలాలపై కీలక ప్రకటన చేసింది.

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపేంత వరకూ నీళ్లను విడుదల చేసేది లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అని గతంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతనిధి రణ ధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్ ముగింపు కాదని దేశ భద్రత విషయంలో అనుసరిస్తున్న ఒక వ్యూహం అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications