తెగబడ్డ చైనా సైన్యం - 30 మందికి పైగా భారత జవాన్లకు గాయాలు: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
న్యూఢిల్లీ: చైనా మరోసారి భారత్‌ను దొంగదెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. అకారణంగా రెచ్చగొట్టేలా వ్యవహరించింది. ఇదివరకు లఢక్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు పాల్పడిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఇప్పుడు కూడా అలాంటి దుందుడుకు చర్యలకు తెగబడ్డాయి. భారత జవాన్లపై దాడికి దిగాయి. వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి శతవిధాలా ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలను భారత సైన్యం తిప్పి కొట్టింది. పీఎల్ఏ బలగాలను నిలువరించగలిగింది.

2020 తరహాలో..
2020 జూన్ 15వ తేదీన అనూహ్యంగా.. ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా చైనా పీఎల్ఏ బలగాలు భారత జవాన్లపై దాడికి దిగిన విషయం తెలిసిందే. రెండు దేశాల జవాన్లు పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయనతో పాటు మరో 20 మంది జవాన్లు అమరవీరులయ్యారు.

అరుణాచల్ ప్రదేశ్ వద్ద..
ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద ఇలాంటి ఘర్షణే భారత్-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకుంది. ఈ నెల 9వ తేదీన తవాంగ్ సెక్టర్ సమీపంలో గల వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల జవాన్లు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో రెండు దేశాల జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనా పీఎల్ఏ బలగాలను భారత్ సరిహద్దు జవాన్లు నిలువరించే ప్రయత్నంలో ఈ ఘర్షణన చోటు చేసుకుందని వివరించారు.

30 మందికి పైగా
తాజాగా చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా భారత జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఆరుమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ ఆరుమందిని అత్యవసర చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా గువాహటికి తరలించినట్లు చెబుతున్నారు.

2006 నుంచీ..
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయని అంటున్నారు. భారత్, చైనా సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2006 నుంచీ తరచూ ఈ తరహా ఎదురు కాల్పులు కొనసాగుతూ వస్తోన్నాయని చెబుతన్నారు. 2020 జూన్ 15వ తేదీన లడఖ్‌లోని గాల్వాన్ లోయలో పీఎల్ఏ దళాలతో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన తరువాత-దీన్ని ఆ తరహా దాడిగా అభివర్ణిస్తోన్నారు.












Click it and Unblock the Notifications