షాకింగ్.. భారత్‌లోకి చొరబడ్డ పాకిస్థానీ మహిళ.. ఎందుకో తెలుసా..?
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీ మహిళను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో తన తండ్రితో తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని తెలిపారు.
భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని కోట్లి జిల్లా గిమ్మ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల షెహనాజ్ అఖ్తర్ అనే పాకిస్థానీ మహిళ.. భారత్ లోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. బాలకోట్ సెక్టార్ లోని దాబ్బీ ఫార్వర్డ్ ఏరియాలో ఆర్మీ దళాలు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. సదరు మహిళ నియంత్రణ రేఖ(LOC) వెంబడి జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు.
అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో.. షెహనాజ్ తన తండ్రితో గొడవపడి ఇంట్లో నుంచి పారిపోయినట్లు తేలింది. అలా LoC వెంబడి జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలోకి ప్రవేశించినట్లు సైనికులు నిర్ధారించారు. అయతే కట్టుదిట్టమైన భద్రత ఉండే సరిహద్దు ప్రాంతంలోకి ఆమె ఎలా ప్రవేశించిందన్న దానిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె సైన్యం అదుపులోనే ఉండగా.. ఇంకా పోలీసులకు అప్పగించలేదు.

ఇక ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకాల ఉన్నట్లు తేలడంతో భారత్.. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులకు పాల్పడి వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది భారత్.












Click it and Unblock the Notifications