భారత ఆర్మీ దాడుల గురించి పాక్ కు ముందస్తు సమాచారం ఇచ్చారా?
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల అమానుష దాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన విధానం, ఆ సమయంలో వ్యవహరించిన తీరు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతో దాడులను విరమించుకోవడం.. విమర్శలకు దారి తీస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అభ్యంతరాలూ వ్యక్తమౌతోన్నాయి.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు ఏపీకి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ దాడి పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ దేశ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు సాగించింది.

అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం సైతం దాడులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లు, మోర్టార్ షెల్స్ తో కాల్పులు జరిపింది. దీన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రతిదాడులతో శత్రుదేశాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. ఇది మరింత తీవ్రతరమౌతుందనుకున్న దశలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారు. ఆయన సూచనలతో భారత్- పాక్ కాల్పుల విరమణ ప్రకటించాయి.
ఈ వైఖరి పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయబోతోన్నామంటూ కేంద్ర ప్రభుత్వం.. పాకిస్తాన్ కు ముందస్తు సమాచారం ఇచ్చిందని ఆ పార్టీ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ స్వయంగా అంగీకరించారని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు గురించి పాకిస్తాన్‌కు ముందుగానే తెలియజేయడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ శనివారం విమర్శలు గుప్పించారు. ఇది నేరమని వ్యాఖ్యానించారు. అలా ముందస్తు సమాచారం ఇచ్చే అధికారం కేంద్రానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యం జైశంకర్ వీడియో క్లిప్ ను దీనికి జత చేశారు. సైనిక చర్య గురించి పాకిస్తాన్ కు ముందుగానే తెలియజేశామని జైశంకర్ బహిరంగంగా అంగీకరించారని, ఇలా ముందుగానే చెప్పడం నేరమని అన్నారు.
Informing Pakistan at the start of our attack was a crime.
— Rahul Gandhi (@RahulGandhi) May 17, 2025
EAM has publicly admitted that GOI did it.
1. Who authorised it?
2. How many aircraft did our airforce lose as a result? pic.twitter.com/KmawLLf4yW
ఫలితంగా పాకిస్తాన్ అప్రమత్తమైందని, భారత వైమానిక దళంపై ప్రతిదాడులు చేయడానికి ఆ దేశానికి అవకాశం లభించినట్టయిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రతిదాడుల్లో వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందని ప్రశ్నించారు. దాడి ప్రారంభంలో పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వడం నేరమని, కేంద్రం ఆ తప్పు చేసిందని జైశంకర్ బహిరంగంగా అంగీకరించారని చెప్పారు.












Click it and Unblock the Notifications