దెబ్బకు దెబ్బ: సైన్యం కాల్పుల్లో 10మంది ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని యూరీలో సైనిక శిబిరంపై దాడి చేసి 18 మంది సైనికులను పొట్టబెట్టుకున్న రెండు రోజులకే ఉగ్రవాదులు మరో దుస్సాహసానికి ప్రయత్నించారు. అయితే ప్రతీకారంతో రగిలిపోతున్న భారత సైన్యం వారిని అంతం చేసింది.
మంగళవారం నియంత్రణ రేఖ వెంబడి రెండు చోట్ల చొరబాట్లకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా దాదాపు 10 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు కూడా వీరమరణం పొందాడు.

సైనిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ సైన్యం.. యూరీ సెక్టార్‌లో భారత శిబిరాలపై కాల్పులకు దిగింది. యూరీ, నౌగామ్ సెక్టార్లలో ఉగ్రవాదులు చొరబాట్లకు యత్నించారు. అప్రమత్తంగా ఉన్న సైన్యం వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సైనిక వర్గాలు తొలుత తెలిపాయి.
అయితే మృతదేహాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాకే ఆ సంఖ్య తెలుస్తుందని ఆ తర్వాత తెలిపాయి. కాల్పులు జరుగుతున్న ప్రదేశాలు దట్టమైన అడవుల్లో ఉన్నాయని వివరించాయి.
నౌగామ్ సెక్టార్‌లో ఒక సైనికుడు మరణించినట్లు సైనిక అధికార ప్రతినిధి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా రెండు చోట్లా సైనిక ఆపరేషన్లు కొనసాగాయి. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు 15 మంది ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications