జై హో కేంద్రమంత్రి ప్రభు!: పారిపోయిన అమ్మాయిల్ని పేరెంట్స్‌కు అప్పగింత
ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చూపించిన చొరవ.. ఇంటి నుంచి పారిపోతున్న 18 ఏళ్ల యువతులను తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. తన శాఖ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాకు వచ్చిన పోస్టును చూసిన మంత్రి సురేష్ ప్రభు చొరవ చూపారు. దీంతో ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల వద్దకు చేరారు.
పశ్చిమ బెంగాల్‌లోని 14 ఉత్తర పరగణాలకు చెందిన ఇద్దరు యువతులు సీబీఎస్ఈ పరీక్షలు రాసి తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులు తిడతారన్న భయంతో పారిపోయారు. తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేశారు. వారిద్దరూ ముంబై వెళుతున్న రైల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ వెంటనే ఓ యువతి తండ్రి రైల్వే మంత్రి సురేష్ ప్రభు సాయం కోరుతూ ట్వీట్ చేశాడు. దానిని చూసిన సురేష్ ప్రభు వెంటనే స్పందించారు. అధికారులను అలర్ట్ చేశారు.
అమ్మాయిలు వెళ్తున్న రైలు ఆగే ప్రతి స్టేషన్లోను ఆర్పీఎఫ్ దళాలను మోహరించారు. అన్ని పెట్టెలను ఎక్కడికి అక్కడ సోదాలు చేశారు. వారు ప్రయాణిస్తున్న గీతాంజలి ఎక్స్‌ప్రెస్.. ముంబై సీఎస్టీకి మరో మూడు గంటల్లో చేరుకుంటుందనగా.. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్లో యువతులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గతంలోను సురేష్ ప్రభు ఇలా శభాష్ అనిపించుకున్న సందర్భాలున్నాయి.












Click it and Unblock the Notifications