బిజెపి నుండి జస్వంత్ వెలి, 24గం.ల్లో అలీపై యూ టర్న్
న్యూఢిల్లీ: జైసల్మేర్: బిజెపి సీనియర్ నేత, రెబల్ అభ్యర్థి జస్వంత్ సింగ్‌ను ఆ పార్టీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా బర్మేర్ నుంచి స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోటీ నుంచి తప్పుకోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఆ పార్టీ ఈ నిర్ణయానికి వచ్చింది.
ఈ నిర్ణయంపై జశ్వంత్ అసహనాన్ని వెలిబుచ్చారు. పార్టీ అగ్రనాయకత్వంపై మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఆయనపై వేటు పడడం ఇది రెండోసారి. జశ్వంత్‌తోపాటు మరో రెబల్ సుభాష్ మహేరియానూ పార్టీ బహిష్కరించింది. అంతకుముందు పోటీ నుంచి వెనుదిరగే ప్రసక్తే లేదని, తాను పోటీలోనే ఉన్నానని ఆయన అన్నారు. పార్టీ సీనియర్ నేతలు పోటీపై ఆయనతో టచ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

సాబిర్ అలీకి 24 గంటల్లో నో
బీహార్ సీనియర్ నేత సాబిర్ అలీకి బిజెపి సభ్యత్వం ఇవ్వడం స్వపక్షంలోనే తీవ్రస్థాయిలో దుమారం రేగాయి. దీంతో బిజెపి పెద్దలు అలీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అలీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. కాగా, తన సభ్యత్వాన్ని రద్దు చేయడంపై అలీ స్పందిస్తూ.. దీన్ని తాను అవమానంగా భావించడం లేదని, అయితే పార్టీ నిర్ణయంపై తన న్యాయవాదిని సంప్రదిస్తానని, ట్విట్టర్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత నక్వీపై పరువు నష్టం దావా వేస్తానని అలీ ప్రకటించారు.
మరోవైపు, ట్విట్టర్‌లో అలీ చేరికకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ను నక్వీ శనివారం తొలగించారు. తన ట్వీట్ లక్ష్యం నెరవేరడంతో దాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అలీ వంటి నేరచరితులను పార్టీలో చేర్చుకోవడంపై ఆరెస్సెస్ కూడా బిజెపిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అలీని పార్టీలో చేర్చుకోవడం సరైన నిర్ణయం కాదని ఆరెస్సెస్ నేత రాంమాధవ్ పేర్కొన్నారు. యోగా గురువు బాబా రాందేవ్ సైతం అలీని చేర్చుకోవడంపై నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications