మా వాళ్లే: చైన్నై పేలుళ్లుపై సాయం వద్దన్న జయలలిత
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయాన్ని తిరస్కరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఈ పేలుళ్లకు సంబంధించిన కేసును రాష్ట్రానికి చెందిన స్పెషల్ వింగ్ పోలీసులు అధికారులకు అప్పగించారు.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో జరిగిన పేలుళ్లను తమిళనాడు రాష్ట్రం ఉగ్రవాద చర్యగా భావించడం లేదు. పేలుళ్ల సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ ఢిల్లీ, హైదరాబాదుల నుండి ఎన్ఐఏ, ఎన్ఎస్‌జి దళాలకు చెందిన ఫోరెన్సిక్, దర్యాఫ్తు నిపుణులను పంపాలని నిర్ణయించింది.

అయితే, జయలలిత మాత్రం కేంద్రం చొరవను తిరస్కరించింది. ఈ పేలుళ్లను విచారించడం తమ రాష్ట్ర పోలీసులకు సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
కాగా, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలిన విషయం తెలిసిందే. బాంబు పేలుళ్లతో చెన్నై రైల్వే స్టేషన్ దద్ధరిల్లింది. ఈ ఘటనలో ఓ టెక్కీ మరణించారు.
చెన్నై రైల్వే స్టేషన్‌లోని 9వ నెంబర్ ఫ్లాట్‌ఫారంపై గురువారం ఉదయం 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. జంట పేలుళ్లు సంభవించాయి. బాంబు పేలుడు సంభవించిన సమయంలో గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్లాట్ పారంపై ఆగి ఉంది. బాంబు పేలిన సమయంలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications