జల్లికట్టుపై స్టే: ప్రధాని మోడీకి జయ లేఖ, నిరసనలు
చెన్నై: జల్లికట్టు పోటీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి కోర్టు తీర్పు అనంతరం లేఖ రాశారు.
ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో ప్రధాని మోడీని జయలలిత కోరారు. జల్లికట్టుపై గతంలో సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని గతవారంలో కేంద్రం ఎత్తివేసింది. దీంతో తమిళనాడులో సంబరాలు చేసుకున్నారు.
అయితే జంతు పరిరక్షణ సంస్ధతో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతూ క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే జల్లికట్టును నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు జల్లికట్టు అనుమతిపై స్టే విధిస్తూ కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

సుప్రీం కోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ మధురైలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. జల్లి కట్టుకు అనుమతి మంజూరు చేస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ పై సుప్రీం కోర్టు ఈ రోజు స్టే ఇచ్చిందన్న వార్త తెలియగానే అవనియా పురం, అలంగనల్లూరు, పలమేడు ప్రాంతాలలో వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు.
ఈ మూడు ప్రాంతాలు జల్లికట్టు బాగా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతాలలో ప్రదర్శకులు రోడ్లను దిగ్బంధం చేసి జల్లికట్టుకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంక్రాంతి పండుగకు మరో రెండు రోజులే ఉండటంతో ఈ పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తి అయ్యాయి. మంగళవారం సుప్రీం కోర్టు స్టే విధించిన వార్త తెలియడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.












Click it and Unblock the Notifications