కాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి.. ప్రఖ్యాత లాల్‌చౌక్ వద్ద బీభత్సం..
ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నవేళ.. జమ్మూకాశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది. పది రోజుల కిందటే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని పుల్వామా జిల్లా నేవాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను బాంబులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన టెర్రరిస్టులు.. ఇవాళ ఏకంగా శ్రీనగర్ సిటీలోనే భీభత్సం సృష్టించారు.
అదనుచూసి..
శ్రీనగర్ సిటీలోని చారిత్రక లాల్ చౌక్ వద్ద ప్రతాప్ పార్కులో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. నిత్యావసరాలతోపాటు దుస్తులు వగైరా కొనేందుకు జనం పెద్దసంఖ్యలో మార్కెట్ కు వస్తారు. ఇదే అదనుగా భావించిన టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. అక్కడ కాపలాగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ పై గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. దాడిలో జవాన్ తోపాటు నలుగురు సాధారణ పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.

ఉలిక్కిపడ్డ జనం..
గ్రనేడ్ల పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతాప్ పార్కులోని జనం హడలిపోయారు. లాల్ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. గాయపడ్డ జవాన్ ను, నలుగురు సివిలియన్స్ ను హుటాహుటి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఐదుగురి ఆరోగ్య పరిస్థితి ఇంకా తెలియాల్సిఉంది. దాడి జరిగిన ఏరియాను చుట్టుముట్టిన సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసు బలగాలు ముష్కరుల గాలింపుచేపట్టింది.












Click it and Unblock the Notifications