జో బైడెన్-యూరోపియన్ కమిషన్ జాయింట్ స్టేట్‌మెంట్: రష్యా పార్లమెంటేరియన్లపైనా
బ్రస్సెల్స్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నెల రోజులు దాటేసింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం భీకరంగా సాగుతూనే ఉంది. రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ఒకవంక శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. రష్యా సంధిస్తోన్న రాకెట్లు, మిస్సైళ్ల ధాటికి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు ధ్వంసం అయ్యాయి. మరుభూమిగా మారాయి. రష్యా సైనిక బలగాల దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. వారి దూకుడును అడ్డుకుంటోంది.
అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టాయి. ఈ కూటమి దేశాలకు అమెరికా నాయకత్వాన్ని వహిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడానికి వ్యూహాలు పన్నింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పాటైన నాటో సభ్య దేశాల అత్యవసర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమ్మిట్‌ను ఉద్దేశించి- ప్రసంగించారు. రష్యాపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. జీ 20 నుంచి తప్పించాలని సూచించారు.

ఈ పరిస్థితుల మధ్య జో బైడెన్- యూరోపియన్ కమిషన్ ఛైర్‌పర్సన్ ఉర్సులా వొన్‌డెర్‌లెయెన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం జాయింట్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడులు ఏకపక్షమైనవిగా ఈ స్టేట్‌మెంట్ అభివర్ణించింది. అమెరికా-యూరోపియన్ కమిషన్ ఈ దాడులను సమైక్యంగా తప్పుపడుతున్నాయని పేర్కొంది. అమెరికాతో కలిసి యూరోపియన్ కమిషన్ దేశాలు సంయుక్తంగా రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలను విధించాలని తీర్మానించింది.
రష్యాపై ఇప్పటిదాకా 400 వరకు అమెరికా వివిధ రకాల ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేసినట్లు జాయింట్ స్టేట్‌మెంట్‌లో పొందుపరిచారు. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా కూడా రష్యాను వ్యతిరేకిస్తోన్నాయని స్పష్టం చేశారిందులో. రష్యా దిగువ సభ డ్యూమాలో సభ్యత్వం ఉన్న 328 మందిపై అమెరికా-యూరోపియన్ కమిషన్ ఆంక్షలను విధించిందని, ఆ దేశానికి చెందిన డజన్ల కొద్దీ రక్షణ సంస్థల నుంచి దిగుమతులను నిలిపివేసిందని ఇందులో వివరించారు.












Click it and Unblock the Notifications