Kamal Haasan: కోటి మంది ప్రమాదంలో? రాజ్యసభలో తొలి ప్రసంగమే సంచలనం
నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభలో తన తొలి ప్రసంగంతోనే రాజకీయ వర్గాల్లో చర్చను రాజేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని నేరుగా విమర్శించారు. అయితే ఈ ప్రసంగానికి ప్రత్యేక బలం ఇచ్చింది మాత్రం... తెలుగు మహాకవి శ్రీశ్రీ కవిత్వం.
ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ప్రమాదాలను వివరించే క్రమంలో కమల్ హాసన్, "జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్... వస్తున్నాయ్..." అంటూ శ్రీశ్రీ కవితలోని పంక్తిని సభలో చదివారు. తానేం మాట్లాడుతున్నానో తెలుగు వారికి అర్ధం అవుతుంది అని కూడా వెల్లడించారు. ఈ ఒక్క లైన్‌తోనే ఆయన ప్రసంగం రాజకీయ విమర్శ నుంచి ప్రజాస్వామ్య హెచ్చరికగా మారింది.

ఓటుహక్కు కోల్పోయే పరిస్థితి..
ఎస్‌ఐఆర్ అమలుతో తమిళనాడులో సుమారు కోటి మంది ఓటర్లు బతికుండి కూడా ఓటుహక్కు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చని కమల్ హాసన్ అన్నారు. స్పెల్లింగ్ లోపాలు, చిరునామా తప్పులు పేరుతో ఓటర్ల జాబితా నుంచి ఏకపక్షంగా తొలగించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజల ఓటు హక్కును హరించే చర్యగా అభివర్ణించారు. బిహార్‌లో ఇప్పటికే అమలైన ఎస్‌ఐఆర్‌ను ఉదాహరణగా ప్రస్తావించిన కమల్ హాసన్, ఆ రాష్ట్రం "జీవచ్ఛవాల భూమి"గా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పరిస్థితి దేశవ్యాప్తంగా వ్యాపించకూడదని హెచ్చరిస్తూ, ఈ ప్రక్రియకు ఎన్నికల సంఘమే సహకరిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సర్వేకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని కమల్ హాసన్ తెలిపారు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యగా ఆయన అభిప్రాయపడ్డారు.
భాషలకు మాత్రమే శాపం..
తన ప్రసంగంలో కమల్ హాసన్ ఎన్నికల సంఘం తీరుపై ఘాటుగా స్పందించారు. "అక్షర దోషాలు భాషలకు మాత్రమే శాపం. ఆధునిక సాహిత్యం, ఇంటర్నెట్ వాటిని పట్టించుకోవు. కానీ ఎన్నికల సంఘం అలా కాదు" అని వ్యాఖ్యానించారు. "ఈసీ అంటే ఇంగ్లిష్ కోచెస్ కాదు" అని వ్యాఖ్యానిస్తూ, సహకారం లేకపోతే ఫలితంగా సగం ఉడికిన, అసంపూర్తిగా మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియ మాత్రమే మిగులుతుందని అన్నారు.
సభలో శ్రీశ్రీ కవిత్వం..
ప్రసంగానికి ముగింపు పలికే సమయంలో కమల్ హాసన్ మరోసారి శ్రీశ్రీ కవిత్వాన్ని సభలో ఉటంకించారు. "జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్... వస్తున్నాయ్..." అంటూ ప్రజాస్వామ్య రథం ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. భారతదేశమనే ప్రజాస్వామ్య రథం ముందుకు సాగుతూనే ఉంటుందని, ప్రజాస్వామ్య శక్తితో దాన్ని నడిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎవరూ శాశ్వతం కాదని, ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా ఉండాలనే లక్ష్యంతో వ్యవహరించకూడదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలో అలాంటి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడలేదని గుర్తు చేశారు. "పిల్లలు చూస్తున్నారు, జెన్ జెడ్ చూస్తోంది" అంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications