దెబ్బకు దిగివస్తున్న మోదీ, అమిత్ షా ?, అడ్రస్ లేకుండా పోతామని ఆవేదన !
బెంగళూరు/గుజరాత్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నది. స్వామి భక్తి చాటుకోవడానికి కర్ణాటక బీజేపీ నాయకులు బీజేపీ హైకమాండ్ చెప్పిన అమూల్ ఎంట్రీకి ఓకే చెప్పారు. చివరికి అసెంబ్లీ ఎన్నికల దెబ్బతో కర్ణాటకలో అమూల్ కు తాత్కాలికంగా బ్రేక్ లు వెయ్యాలని బీజేపీ డిసైడ్ అయ్యిందని తెలిసింది.
కర్ణాటకలో నందిని పాలుకు, నందిని డైరీ ఉత్పత్తులకు పోటీగా గుజరాత్ కు చెందిన అముల్ కర్ణాటకలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని కన్నడిగులతో పాటు రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినా కర్ణాటకలో అమూల్ ఎంట్రీ విక్రయాలను బీజేపీ నాయకులు సమర్థించుకున్నారు.

బీజేపీ నాయకుల తీరుతో నందినిని సర్వనాశనం చెయ్యడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు ఏకమై దుమ్మెత్తిపోశాయి. రైతు సంఘాలు, కన్నడ సంఘాలు కూడా బీజేపీ తీరుతో విరుచుకుపడి రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. నందిని ముద్దు, అమూల్ వద్దేవద్దు అంటూ నినాదాలు చేశారు. ఇంత జరిగినా బీజేపీ నాయకులు అమూల్ కు వత్తాసు పలుకుతూ వచ్చారు.
ఇప్పుడు నందిని VS అమూల్ వ్యవహారం ముదిరిపోయింది. తెర మీదకు ఆంధ్రా పాలు వచ్చాయి. అయితే ప్రతిపక్షాలు, కన్నడిగులు, రైతు సంఘాలు అమూల్ విషయంలో ఏకం కావడంతో బీజేపీ నాయకులు బిత్తరపోయారు. నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అమూల్ వ్యవహారం బీజేపీ నాయకులకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.

నందినితో పెట్టుకుని అమూల్ కు మద్దతు ఇస్తే అడ్రస్ లేకుండాపోతామని ఆలస్యంగా గుర్తించిన బీజేపీ నాయకులు కర్ణాటకలో అమూల్ విక్రయాలకు తాత్కాలికంగా బ్రేక్ లు వెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత అమూల్ వ్యవహారంలో సరైన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యిందని సమాచారం.
అయితే మేము అధికారంలోకి వస్తే అమూల్ ను కర్ణాటకలో అడుగుపెట్టనివ్వమని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రైతులకు హామీ ఇస్తున్నారు. ఈ దెబ్బతో బీజేపీ నాయకులు ఓటమి భయంతో అయోమయంలో పడిపోతున్నారని తెలిసింది. మొత్తం మీద కర్ణాటకలో అమూల్ కు వత్తాసు పలికిన బీజేపీ నాయకులకు చుక్కలు చూపించాలని రైతులు, కన్నడిగులు డిసైడ్ అయ్యారు.












Click it and Unblock the Notifications