హిజబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు: చీఫ్ జస్టిస్ నివాసం వద్ద భారీ భధ్రత: స్పందించిన ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటకలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హిజబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తుది తీర్పు వెలువడించింది. హిజబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలు, విద్యాసంస్థలు, పాఠశాలలకు హాజరు కావడాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. హిజబ్‌ను ధరించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నడచుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి వాటిని పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు.
కర్ణాటక హైకోర్టు హిజబ్ విషయంలో తీర్పు వెలువడించిన అనంతరం బొమ్మై తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజ్యంగం, చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో కులాలు, మతాలకు అవకాశం లేదని అన్నారు. విద్యార్థులందరూ సమానమేననే ఉద్దేశంతోనే యూనిఫాం వ్యవస్థ అమల్లో ఉందని పేర్కొన్నారు. హిజబ్‌పై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పాటించాలని ప్రతి విద్యార్థికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

శాంతిభద్రతలను కాపాడటానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని సహించబోమని హెచ్చరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకునే పరిస్థితిని కల్పించొద్దని బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థల యజమానులు, బోధన, బోధనేతర సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ హైకోర్టు తీర్పును గౌరవించాలని చెప్పారు.
తీర్పు నేపథ్యంలో- ప్రధాన న్యాయమూర్తి నివాసం వద్ద పోలీసులు అదనపు పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. తీర్పును వ్యతిరేకించే వారు ఆయన నివాసంపై వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉందనే అనుమానంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బెంగళూరు వ్యాప్తంగా వారం రోజుల పాటు హైఅలర్ట్‌ను విధించారు. ఈ నెల 21వ తేదీ వరకు ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.












Click it and Unblock the Notifications