తిరుపతి లడ్డూకు నెయ్యి వివాదం : బీజేపీ నిర్వాకం బయటపెట్టిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య..
కర్నాటకలో స్ధానిక పాల సరఫరాదారుల సమాఖ్య నుంచి తిరుపతి లడ్డూకు నెయ్యి పంపిణీ కాకపోవడంపై బీజేపీ అక్కడి సిద్ధరామయ్య సర్కార్ పై కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలపై పక్షపాతం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తోంది. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తిరుపతి లడ్డూకు కర్నాటక నుంచి వెళ్లాల్సిన నెయ్యి సరఫరా ఆగిపోవడం వెనుక కారణాన్ని ఆయన బయటపెట్టారు.
కర్నాటక పాల సరఫరాదారుల సమాఖ్య నుంచి తిరుపతి లడ్డూకు నెయ్యి పంపిణీ చేసే విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, గతంలో 2021లో బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వమే కర్నాటక నెయ్యి సరఫరా నిలిపేసిందని సిద్ధరామయ్య వెల్లడించారు. తిరుపతి లడ్డూ తయారీ కోసం నందూ బ్రాండ్ తో సరఫరా చేస్తున్న నెయ్యిని 2021లోనే నిలిపేసిన బీజేపీ ఇప్పుడు తమపై విమర్శలు చేయడమేంటని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

ఈ మేరకు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ పై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుపతి లడ్డూకు నెయ్యి సరఫరా ఆపేసిన బొమ్మై హిందూ వ్యతిరేకా, హిందువులకు బీజేపీ వ్యతిరేకమా ఇప్పుడు చెప్పాలని సిద్ధరామయ్య ప్రశ్నించారు. దీంతో బీజేపీ ఇరుకునపడింది. గతంలో బీజేపీ పాలనలో మతపరమైన అంశాల్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ది పొందిన కాషాయ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ అవే అంశాలతో టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ కౌంటర్లు ఇచ్చేస్తోంది. ముఖ్యంగా మతపరమైన అంశాలపై బీజేపీ ప్రభుత్వాలు గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఎక్కడికక్కడ తిరగతోడుతున్న ప్రభుత్వం.. బీజేపీ నేతల విమర్శలకు సైతం కౌంటర్లు వేస్తోంది. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంతో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు మరోసారి భంగపాటు తప్పలేదు.












Click it and Unblock the Notifications