కర్నాటక సీఎం సిద్ధరామయ్య తొలి సంతకం అదే- ఐదు హామీల అమలుకు ఆదేశాలు..
కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరో ఏడుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కర్నాటక కేబినెట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాము ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీల్ని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకుంటామని ప్రకటించారు.
రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగానే కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. బాధ్యతలు చేపట్టగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన ఐదు హామీల్ని నిలబెట్టుకుంటూ తొలిసంతకం చేశారు. ఐదు హామీల్ని నిలబెట్టుకునేందుకు వీలుగా ముందుగా తయారు చేసి పెట్టిన ఆదేశాలపై సిద్ధరామయ్య సంతకం చేశారు. దీంతో అధికారంలోకి వచ్చిన గంటల్లోనే ఎన్నికల హామీలన్నింటినీ నిలబెట్టుకున్న ప్రభుత్వంగా సిద్ధరామయ్య సర్కార్ చరిత్ర సృష్టించింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీల్ని ఓసారి పరిశీలిస్తే ఇందులో అన్ని ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకం మొదటిది. అలాగే ప్రతీ ఇంట్లో యజమాని అయిన మహిళకు నెలకు రూ.2000 ఇచ్చే గృహలక్ష్మి పథకం రెండవది. రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికీ ఉచితంగా నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చే అన్న భాగ్య పథకం మూడవది. అలాగే రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, డిప్లమో హోల్డర్లకు రూ.1500 చొప్పున ఇచ్చే యువనిధి పథకం నాల్గవది. చివరిగా రాష్ట్రంలో ప్రతీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం ఐదవది.
ఈ ఐదు హామీల్ని అధికారం చేపట్టిన తొలిరోజే అమలు చేస్తామని హామీ ఇచ్చిన కర్నాటక ప్రభుత్వం.. అన్నట్లుగానే అమలు చేసింది. తద్వారా ప్రజలు తమపై పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చినట్లయింది. ఇక వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గరిష్టంగా ఎంపీ సీట్లు గెల్చుకోవడమే లక్ష్యంగా కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదపబోతోంది.












Click it and Unblock the Notifications