సీఏఏను అమలు చేయబోమని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
CAA: దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.
రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ స్పష్టతను ఇచ్చింది.

ఊహించినట్టే- జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సీఏఏ అమలులోకి వచ్చినట్లు తెలిపింది. వాటిని నోటిఫై చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత ఈ చట్టం అమలులోకి రావడం చర్చనీయాంశమైంది.
2014 డిసెంబర్‌కు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులు అంటే హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో 2019లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
అప్పట్లో దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఆందోళనలు చోటు చేసుకున్నాయి. రోజుల తరబడి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అల్లర్లల్లో 100 మంది వరకు మరణించారు. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగాయి. దీనితో అప్పట్లో దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం.

సీఏఏకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలను సైతం చేశాయి. వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. ఈ జాబితాలో తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కేరళ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడు కూడా సీఏఏ అమలుకు పెద్దగా సుముఖంగా లేదు.
ఈ చట్టాన్ని తాము అమలు చేయట్లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ప్రజలను నిలువుగా చీల్చేదిగా అభివర్ణించారు. మతాల ప్రాతిపదికన ప్రజలను విడదీయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దేశ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కేంద్రం సీఏఏను అమల్లోకి తీసుకొచ్చిందని మండిపడ్డారు.
2014 డిసెంబర్‌కు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు ఇక్కడి పౌరసత్వాన్ని ఎందుకు అందించరని పినరయి విజయన్ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. సీఏఏను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని చెప్పారు.












Click it and Unblock the Notifications