పెట్రో వాత కొంచెమే.. రూ.6 వరకు పెరిగే ఛాన్స్.. మోడీ సర్కార్ లెక్క ఇదీ
5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది ఫలితాలే.. ఇటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం కొనసాగిస్తోంది. ఇప్పటికే స్వీట్ ఆయిల్‌కు రెక్కలు రాగా.. మిగిలింది పెట్రో వాతనే.. దానికి ఎప్పుడెప్పుడా అని ఆయిల్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. అందుకు తగ్గట్టు ధరల వాత ఉండనుంది.
Recommended Video

ధరల వాత..
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మంట పుట్టిస్తోంది. ముడి చమురు ధర బ్యారెల్ సోమవారం 139 డాలర్ల వరకు వెళ్లింది. ఇదీ 2008 తర్వాత ఇదే అత్యధిక ధర. ఆ తర్వాత 125 డాలర్లకు దిగొచ్చింది. ప్రస్తుతం 127 డాలర్లకు పైన ట్రేడవుతోంది. దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత నవంబర్ 4 నుంచి ధరలను సవరించడం లేదు.
అప్పటి నుంచి చూస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 50 శాతం వరకు పెరిగింది. నాడు 83 డాలర్లకు చేరిపోవడంతో కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించుకున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రేట్లను పెంచకుండా ఆయిల్ కంపెనీలు మౌనం పాటిస్తున్నాయి.

ఫలితాల కోసం..
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిపోగా, ఈ నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో లీటర్ రూ.15-20 వరకు పెంచొచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.6 వరకు పెంచుకునేందుకు అనుమతించాలనే యోచనతో ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐవోసీ, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్) లీటర్ పై రూ.12 వరకు సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆయా కంపెనీలను కోరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇన్వెంటరీ లాభాలు వస్తుంటాయి. కొనుగోలు చేసిన నాటి నుంచి, రిఫైన్ చేసి విక్రయించే నాటికి ధరలు పెరిగితే వచ్చే లాభమే ఇన్వెంటరీ లాభం. దీని నుంచి కొంత సర్దుబాటు చేసుకోవాలని కోరే అవకాశాలు ఉన్నాయి.

కేంద్రం ఇంట్రెస్ట్ చూపించలే
ఈ దశలో ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. దీని వల్ల పన్నుల ఆదాయం తగ్గిపోతుంది. ఒకవేళ చమురు ధరలు గరిష్ఠ స్థాయిలో కొనసాగితే అప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రం తుది నిర్ణయం ఏమిటన్నది వచ్చే రెండు రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications