Lockdown 4.0: లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు..? ఆ జోన్లలో వీటికి సడలింపులు..!
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ మహమ్మారి బారినుంచి దేశప్రజలు సురక్షితంగా ఉంచాలనే యోచనతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్‌ను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఇప్పటికే మూడు సార్లు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతి లాక్‌డౌన్ ప్రకటన తర్వాత కొన్ని నిబంధనలపై సడలింపులను ఇస్తూ కేంద్రం ప్రకటన చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Recommended Video

మరో రెండు వారాలు పొడగింపు
దేశంలో మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ పలు దఫాలుగా కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. తాజాగా కేంద్రం మరో నిర్ణయం తీసుకునట్లు సమాచారం. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే లాక్‌డౌన్ పొడిగింపు ప్రకటన తర్వాత మరిన్ని ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే కొన్నిటికి సడలింపులను ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సారి రెడ్ జోన్లలో ఎలాంటి ఆంక్షలక సడలింపులు లభిస్తాయో ఆసక్తికరంగా మారింది.

మే 17తో ముగియనున్న లాక్‌డౌన్ 3.0
ఇక రెడ్ జోన్లలో కొన్ని ఆంక్షలను ఎత్తివేస్తూ మరికొన్నిటిని కొనసాగిస్తూనే ఇతర జోన్లు అంటే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మరిన్ని ఆంక్షలు ఎత్తివేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే కంటెయిన్‌మెంట్ జోన్లలో మాత్రం ఎలాంటి మినహాయింపులు లేదా సడలింపులు ఉండవని హోంశాఖ వర్గాల సమాచారం. మార్చి 25న ప్రారంభమైన లాక్‌డౌన్ ఆ తర్వాత కేంద్రం క్రమంగా పొడిగిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు మూడు సార్లు లాక్‌డౌన్ పొడిగిస్తూ వచ్చిన కేంద్రం.. చివరి లాక్‌డౌన్ ఆదివారం అంటే మే 17తో ముగియనుంది. ఈ క్రమంలోనే మరో రెండువారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

సడలింపులు ఇవ్వాలని పట్టుబడుతున్న రాష్ట్రాలు
తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర తమిళనాడులు మినిహాయిస్తే చాలావరకు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలు సాగేలా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అయితే అస్సాం రాష్ట్రం మాత్రం కేంద్రం జారీ చేసే గైడ్‌లైన్స్‌ను బట్టి తమ తదుపరి అడుగు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే జోన్లపై తమ నిర్ణయం యథాతథంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంటే గతంలో ఎలాగైతే జోన్లు ప్రకటించారో అలానే అవి కొనసాగుతాయని కొత్త జోన్లు ఏవి ఉండవని స్పష్టం చేశారు. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు జోన్లను నిర్వచించాలని కోరడం జరిగిన నేపథ్యంలో అవి అలానే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందంటే..
ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మెట్రో సర్వీసులను తిరిగేందుకు అనుమతించాలని కోరుతోంది. కేజ్రీ సర్కార్ కోరికను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొన్ని ఎంపిక చేయబడ్డ రూట్లలోనే మెట్రో సర్వీసులను నడిపేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కంటెయిన్‌మెంట్ జోన్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెట్రో సర్వీసులను నడిపేందుకు అనుమతి ఇవ్వబోమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక ఏవియేషన్ రంగం కూడా తన కార్యకలాపాలను ఇప్పట్లో ప్రాంరంభించదని సమాచారం. ఇదిలా ఉంటే ఆటో, ట్యాక్సీలలో తక్కువ మందితో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications