రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
Lok Sabha election 2024 phase 2: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటలకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఆరంభమౌతుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. మొత్తం 89 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. దక్షిణాదిన తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికల ప్ర్రక్రియ సైతం పూర్తయింది.

మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటినప్పటికి క్యూలైన్‌లో ఉన్నవారిని ఓటు వేయడానికి అనుమతి ఇస్తారు ఎన్నికల సిబ్బంది.
ఈ ఎన్నికల్లో పలువురు కీలక నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాహుల్ గాంధీ సైతం ఉన్నారు. ఆయన పోటీ చేస్తోన్న కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నేడే పోలింగ్ జరుగనుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు శశిథరూర్, రాజీవ్ చంద్రశేఖర్ రెండో విడత పోటీలో ఉన్నారు. వారిద్దరూ తిరువనంతపురం నుంచి బరిలో నిలిచారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్- రాజ్‌నంద్‌గావ్, డీకే సురేష్- , బెంగళూరు రూరల్, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే- బెంగళూరు నార్త్, తేజస్వి సూర్య- బెంగళూరు సౌత్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి- మండ్య, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడెయార్- మైసూరు ఈ జాబితాలో ఉన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- హవేరి, శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్- శివమొగ్గ, బీఎస్ యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర- శివమొగ్గ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్- జోధ్‌పూర్, అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్- జాలోర్, నటి హేమ మాలిని- మథుర, టీవీ రాముడు అరుణ్ గోవిల్- మీరట్ నుంచి పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications