కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
Lok Sabha election 2024 phase 2: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటలకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఆరంభమౌతుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. మొత్తం 89 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. దక్షిణాదిన తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికల ప్ర్రక్రియ సైతం పూర్తయింది.

మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది.
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా..కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్, బెంగళూరు సెంట్రల్, కోలార్, చిక్‌బళ్లాపురా, చామరాజనగర, మైసూరు, తుంకూరు, మండ్య, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, హాసన, ఉడుపి-చిక్‌మగళూరు స్థానాల్లో పోలింగ్ ఉంటుంది. మిగిలిన 14 స్థానాలకు మే 7వ తేదీన పోలింగ్‌ను నిర్వహిస్తారు.
కేరళలో ఉన్న మొత్తం 20 లోక్‌సభ నియోజవర్గాలు- కాసర్‌గోడ్, కన్నూర్, వడకర, వాయనాడ్, కోజికోడ్, మళప్పురం, పొన్నాని, పాలక్కాడ, అలత్తూర్, త్రిశూర్, చాలక్కుడి, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజ, మావెల్లిక్కార, పత్తినంథిట్ట, కొల్లం, అట్టింగల్, తిరువనంతపురం స్థానాలకు 26వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.
ఆయా స్థానాల పరిధిలో పోలింగ్ సజావుగా సాగడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తోన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.












Click it and Unblock the Notifications