ముడా స్కామ్ కేసులో సీఎం భార్యను విచారణ చేసిన లోకాయుక్త
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతిని లోకాయుక్త అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ముడా అధికారులు నియమాలు ఉల్లంఘించి సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి పేరుతో ఇంటి స్థలాలు ఇచ్చారని నమోదైన కేసులో లోకాయుక్త పోలీసులు సీఎం సతీమణిని సుమారు నాలుగు గంటల పాటు విచారణ చేసి పలు వివరాలు సేకరించారు.
శుక్రవారం మైసూర్ లో లోకాయుక్త పోలీసు అధికారులు సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతిని విచారణ చేశారు. నాలుగు గంటల పాటు లోకాయుక్త అధికారులు అడిగిన ప్రశ్నలకు సిద్దరామయ్య భార్య పార్వతి సమాధానం చెప్పారని తెలిసింది. ఈ సందర్భంలో సీఎం సిద్దరామయ్య సతీమణి కొన్ని పత్రాలను లోకాయుక్త అధికారులకు అందించారని సమాచారం. సెప్టెంబర్ చివరి వారంలో సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు కొంతమంది మీద లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆర్టీఐ కార్యకర్త కృష్ణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి రెండో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముడాలో 14 ఇంటి స్థలాలను సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి ఇచ్చారని ఆర్టీఐ కార్యకర్త కృష్ణ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతిపైన ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే తాను ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తేలేదని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. సీఎం సిద్దరామయ్య రాజీనామా చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో కర్ణాటక లోకాయుక్త పోలీసులు మైసూరులో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతిని కొన్ని గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించడం తీవ్రచర్చకు దారితీసింది. అయితే ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త పోలీసు అధికారులకు ఏం సమాధానం ఇచ్చారు అనే విషయం బయటకురాలేదని కన్నడ మీడియా అంటోంది.












Click it and Unblock the Notifications