చిరు-నాగార్జునల మాటీవీ, స్టార్ టీవీల మధ్య కీలక ఒప్పందం!
హైదరాబాద్: తెలుగు ఎంటర్‌టైన్మెంట్ మార్కెట్లో కీలక ఒప్పందం. మాటీవీ, స్టార్ గ్రూపు మధ్య అతిపెద్ద వ్యాపార ఒప్పందం కుదిరింది. తద్వారా ఎంటర్‌టైన్మెంట్ మార్కెట్లోకి స్టార్ ఇండియా గ్రూప్ చేరింది. స్టార్ ఇండియా ఆపరేషన్స్‌లో భాగంగా మా టీవీ భాగం కానుంది.
కొన్ని వాటాలను మాటీవీ.. స్టార్ గ్రూప్‌కు విక్రయించింది. మాటీవీ మేనేజ్‌మెంట్ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఒప్పందం వివరాలను సీఈవో నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాటీవీ భాగస్వాములు, హీరోలు అక్కినేని నాగార్జున, చిరంజీవిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టార్ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవీతో టై అప్ కారణంగా ఆ లోటు తీరుతోందన్నారు. అయితే బ్రాడ్‌కాస్ట్ బిజినెస్‌లో భాగస్వాములం మాత్రమేనని చెప్పారు.
కంపెనీ యాజమాన్యం కొనసాగుతుందన్నారు. ప్రమోటర్లు కూడా వాళ్లే ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఇక నుండి మా బ్రాండ్.. స్టార్‌గా మారుతుందని చెప్పారు. రెగ్యులేటర్ అనుమతులు వచ్చాక ఇది అమలులోకి వస్తుందని, తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూరగొనే కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు.

కాగా, నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవిందులకు మాటీవీలో మెజార్టీ వాటాలు ఉన్నాయి. ఎంత వాటాలు కొన్నారనే విషయం వెల్లడించలేదు. వాటాలు ఎంత కొన్నారనేది తర్వాత చెబుతామని వారు తెలిపారు. సోనీ గ్రూప్‌తో ఎలాంటి ఒప్పందాలు లేవని నిమ్మగడ్డ ప్రసాద్ చెప్పారు. నాణ్యమైన ప్రసారాలు అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications