నాజల్ వ్యాక్సిన్స్.. భారత్‌లో అవి గేమ్ ఛేంజర్.. థర్డ్ వేవ్‌లో చిన్నారులను రక్షించే అస్త్రం : డబ్ల్యూహెచ్ఓ
భారత్‌లో నాజల్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వస్తే... కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. నాజల్ వ్యాక్సిన్లను సులువుగా ఇవ్వొచ్చునని... శ్వాసకోశ సమస్యలకు సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి బాగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అయితే భారత్‌లో ఈ ఏడాది నాజల్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
Recommended Video

టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే... : సౌమ్య స్వామినాథన్
'ఎట్టకేలకు చిన్నారుల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే అది ఈ సంవత్సరం అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గేంతవరకూ స్కూళ్లను తెరవద్దు. ఇతర దేశాలు కూడా ఇదే పాటిస్తున్నాయి. నాజల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే లోగా దేశంలోని టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే కోవిడ్‌పై పోరాటంలో అది కీలకంగా మారుతుంది.' అని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.

నాజల్ వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయి...
భారత్‌లో కరోనా మూడో వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాజల్ వ్యాక్సిన్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఈ నాజల్ వ్యాక్సిన్లను అభివృద్ది చేస్తోంది. సాధారణ వ్యాక్సిన్లలా కాకుండా ఈ వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా ఇస్తారు.
ఇవి అందుబాటులోకి వస్తే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దే ఎవరికి వారు ఈ వ్యాక్సిన్ డ్రాప్స్‌ను ముక్కులో వేసుకోవచ్చు. ముక్కులోని శ్లేష్మ పొరల్లో ఉన్న వైరస్‌ను ఇది అంతం చేస్తుంది. సాధారణంగా కరోనా వైరస్ ముక్కులోని శ్లేష్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముక్కు ద్వారా ఇచ్చే నాజల్ వ్యాక్సిన్ల ద్వారా వైరస్‌ను శ్లేష్మ పొరల్లోనే నిర్మూలించే అవకాశం ఉంటుంది.

భారత్ బయోటెక్ సంస్థ ట్రయల్స్
ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ బయోటెక్ కంపెనీకి 'బిబివి 154' ఇంట్రానాసల్ వ్యాక్సిన్ పరీక్షకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ప్రకారం వ్యాక్సిన్ తీసుకునే వాలంటీర్లను మూడు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్ ఇచ్చారు. మొత్తం 175 మందిలో మొదటి, రెండవ గ్రూపులో 70 మంది వాలంటీర్లు, మూడవ గ్రూపులో 35 మంది వాలంటీర్లపై ట్రయల్స్ జరిపారు. త్వరలోనే ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే అమెరికాలో టీనేజర్లకు వ్యాక్సిన్
అమెరికాలో 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు టీనేజర్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో రెండు నెలల్లో మరో రెండు వ్యాక్సిన్లను కూడా అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో మోడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ది చేసిన వ్యాక్సిన్లు ఉన్నాయి. మోడెర్నా ఇప్పటికే 3000 మంది చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫలితాలు రాబోయే కొన్ని వారాల్లో తెలియనున్నాయి.












Click it and Unblock the Notifications