ఆమె జీతం రూ.30వేలు... 100 శునకాలు, లగ్జరీ కార్లు, లగ్జరీ విల్లా!!
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతి భాగోతాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు తవ్వితీశారు. ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా చేరిన ఆమె.. 10 సంవత్సరాల కాలంలోనే కోట్లకు పడగలెత్తింది. 100 శునకాలు, 20 వాహనాలు అందులో 10 లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు చూసి అధికారులే అవాక్కయ్యారు.
భోపాల్ కు చెందిన హేమా మీనా 2011లో కాంట్రాక్టు బేసిస్ లో మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఇన్ ఛార్జి అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. నెలకు 30వేల జీతం తీసుకున్న మీనా పై అవినీతి నిరోధక శాఖాధికారులకు 2020లో ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేపట్టిన తర్వాత లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగానికి చెందిన అధికారులు సాధారణ దుస్తుల్లో మీనా ఇంటికి వెళ్లారు. వాచ్ మెన్ అడ్డుకోగా సోలార్ ప్యానెల్స్ బాగుచేస్తామని, వాటిని రిపేరు చేసేందుకు వచ్చామని చెప్పి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లగానే మీనాను అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లోనే అధికారులు.. రూ.7కోట్ల విలువైన ఆస్తుల వివరాలను బయట పెట్టారు. 20వేల చదరపు అడుగుల వ్యవసాయ భూమిని ఆమె తండ్రి పేరు మీద కొనుగోలు చేసి ఆ స్థలంలో రూ.కోటితో లగ్జరీ విల్లాను నిర్మించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టే ప్రాజెక్టుల కోసం ఉపయోగించే కన్ స్ట్రక్షన్ మెటీరియల్ కూడా తన ఇంటికి వాడారు. 7 లగ్జరీ కార్లు, రూ.30లక్షల విలువ చేసే 98 అంగుళాల మోడరన్ టీవీ సెట్, పూర్తి వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్స్ స్వాధీనం చేసుకున్నారు.
100 పెంపుడు కుక్కలు, వాటికి రోటీలు చేసేందుకు ఒక రోటీ మిషన్ ఉంది. పోలీస్ హౌసింగ్ బోర్డ్ కు చెందిన లక్షలాది రూపాయల విలువచేసే పరికరాలు కూడా ఉన్నాయి. 20 మేలుజాతి పశులు, భారీ వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు చూసి కంగుతిన్నారు. బిల్ఖిరియాలో మీనా ఇంటితోపాటు రైసెన్, విదిశ జిల్లాల్లో కూడా వ్యవసాయ భూములున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications