Madhya Pradesh Polls: ఎవరిది అహంకారమో తేలుస్తాం-సింధియాకు కమల్ నాథ్ కౌంటర్..
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న జరిగే ఎన్నికలకు ముందు మాటల తూటాలు పేలుతున్నాయి. ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొందన్న వార్తల నేపథ్యంలో పైచేయి సాధించేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒకప్పటి తన సహచరుడు, కాంగ్రెస్ మాజీ సీఎం కమల్ నాథ్
ను టార్గెట్ చేస్తున్నారు. అలాగే తన మాజీ పార్టీ కాంగ్రెస్ పైనా విమర్శలకు దిగుతున్నారు.
ఇదే క్రమంలో జ్యోతిరాదిత్య సింధియా తాజాగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి మధ్యప్రదేశ్ ప్రజలు ఈ నెల 17న చరమగీతం పాడతారని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారంటూ సింధియా జోస్యం చెప్పారు. ఓవైపు బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంజన్ లేని ప్రభుత్వం నడిపిందని సింధియా విమర్శించారు.

సింధియా విమర్శలపై స్పందించిన కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి కమల్ నాథ్.. ఎవరిది అహంకారమో ప్రజలే తేలుస్తారన్నారు. 15 నెలల క్రితం రాష్ట్రంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి సమాధానం ఇచ్చారని, 35 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మేయర్ స్ధానాల్లో ఆధిక్యం సాధించిందని, ఇది ఎవరి అహంకారమని సింధియాను ప్రశ్నించారు. తద్వారా ఎవరు అహాంకారులో ప్రజలు తేల్చేశారని కమల్ నాథ్ తెలిపారు. తద్వారా సింధియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయి. ఎన్నికలకు మరో 11 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో కమల్ నాథ్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ పలు విమర్శలు చేస్తోంది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేయబోతున్నారు. అయితే గతంలో బీజేపీతో చేతులు కలిపి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన సింధియాపై జనం ఆగ్రహం మాత్రం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications