ప్రయాగ్‌రాజ్ వచ్చే భక్తులకు యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి
Mahakumbh 2025 stampede: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆరా తీశారు. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని చెప్పారు. ప్రాణనష్టం తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని అఖాడా పరిషత్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మౌని అమావాస్యను పురస్కరించుకుని ఆచరించాల్సిన అమృత్ స్నానాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, వసంత పంచమి నాడు తాము అమృత్ స్నాన్ ఆచరిస్తామని పేర్కొంది.
ఈ దిగ్భ్రాంతికర ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్, పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.
త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వేల సంఖ్యలో భక్తులు అక్కడికే వెళ్లడం వల్ల ఈ చర్యలకు ఆటంకం కలుగుతుందని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. తమకు దగ్గరగా ఉన్న ఘాట్ల వద్దకు వెళ్లాలని కోరారు. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని కోరారు.












Click it and Unblock the Notifications