ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 9 మందికి సీరియస్
కొద్దిసేపటి క్రితమే జరిగిన రైలు ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది. ఆ సమయంలో వ్యాన్ లో మొత్తం 17 మంది ఉన్నారు. వీరిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 9 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరంతా దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం.
మస్వాడ్- పాంధార్ పూర్ రోడ్డుపై ఈ షాకింగ్ ఘటన జరిగింది. బావిలో నీళ్లు ఫుల్ గా ఉండటంతో వ్యాన్ పడిపోగానే క్షణాల్లోనే మునిగిపోయింది. దాంతో అందులోని ప్రయాణికులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఊపిరాడక కొంతమంది.. ఈత రాకపోవడం వల్ల మరికొంత మంది ఇలా వ్యాన్ లోని మొత్తం 17 మందిలో 8 మంది మృతి చెందడం తీవ్రంగా కలచివేసే విషయం. ఇక మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదాన్ని గమనించిన గ్రామస్థులు అతి కష్టం మీద 9 మందిని కాపాడగలిగారు. ప్రస్తుతం వీరంతా సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా పాంధార్ పూర్ మండలంలోని రంజని గ్రామానికి చెందినవారని తెలిపారు. వీరంతా సతారా జిల్లా సిద్దనాథ్ దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే రోడ్డు పక్కన ఎలాంటి సేఫ్టీ వాల్ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారికి వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications