మహా కుంభ్ కాదు మృత్యు కుంభ్.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మహా కుంభ్ కాదు మృత్యు కుంభ్ అని ఆమె అసెంబ్లీ వేదికగా అభివర్ణించారు. కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందని.. పవిత్ర గంగమ్మ తల్లి అంటే తనకు పూజ్యభావం ఉందని తెలిపారు. కానీ యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మమతా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలను గుర్తు చేసుకున్నారు. తొక్కిసలాట సంఘటనలో మృతదేహాలను పోస్ట్ మార్టం చేయకుండానే బెంగాల్ కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ప్రజలకు కూడా ఎటువంటి పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. తొక్కిసలాట జరిగే అవకాశాలున్నాయని తెలిసినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అని యోగి ప్రభుత్వాన్ని నిలదీశారు.

అలానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళాలో వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందని.. కానీ పేదలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని మండిపడ్డారు. కుంభమేళాలో సంపన్నులు రూ.1 లక్ష ఖర్చు చేసి టెంట్లు సొంతం చేసుకుంటున్నారని.. కానీ పేదవాళ్లు అంత ఖర్చు చేయగలరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ఓ ప్రణాళిక లేకుండా ఇంతటి భారీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు.
అంతే కాకుండా దేశాన్ని విభజించడానికి మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని బిజెపి సర్కారుపై నిప్పులు చెరిగారు. మరణ ధృవీకరణ పత్రాలు కూడా లేకుండా మృతదేహాలను పంపడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మృతదేహాలకు బెంగాల్ లోనే పోస్ట్‌మార్టం చేశామని వాపోయారు.
ఇక ఈ నెల 26 వరకు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మన దేశంలోని వారే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సామాన్యభక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక గత ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications