కరోనాతో పోయాడని అంత్యక్రియలు-రెండేళ్ల తర్వాత ప్రత్యక్షం..
రెండేళ్ల క్రితం కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇలా మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు కూడా నిర్వహించే భాగ్యం కూడా దక్కలేదు. దీంతో వారు నిస్సహాయంగా ఇళ్లలోనే ఉండిపోయి కన్నీరు కార్చడం మినహా చేసేదేమీ లేకపోయింది. కానీ కోవిడ్ తో మరణించిన తమ కుటుంబ సభ్యులకు స్వయంగా అంత్యక్రియలు జరిపించే అవకాశం దక్కిన వారి పరిస్ధితీ దయనీయమే అని నిరూపించే ఘటనలు ఆ తర్వాత ఎన్నో బయటపడ్డాయి. ఇలాంటిదే తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో రెండేళ్ల క్రితం కరోనా రెండో వేవ్ లో కమలేష్ పటీదార్ అనే 35 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకింది. దీంతో అతని కుటుంబ సభ్యులు గుజరాత్ లోని వడోదరకు తీసుకెళ్లి అక్కడి స్దానిక ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మృత్యువాత పడ్డాడు. దీంతో స్ధానికంగా ఉన్న నిబంధనల ప్రకారం మరో రాష్ట్రానికి కరోనా మృతదేహాన్ని తీసుకెళ్లే పరిస్ధితి లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు తిరిగి వచ్చేశారు.

అనంతరం తాజాగా కరోనాతో మరణించిన సదరు వ్యక్తి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. మధ్యప్రదేశ్ లోని తన స్వగ్రామం కరోడ్కలకు హఠాత్తుగా తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులకు సడన్ షాకిచ్చాడు. దీంతో కమలేష్ ను చూసిన కుటుంబ సభ్యులు తొలుత భయపడ్డా ఆ తర్వాత గుర్తించారు. ఇన్నాళ్లు ఎక్కడున్నాడనే విషయాన్ని ప్రశ్నించారు. కానీ అతను చెప్పలేకపోతున్నాడు. దీంతో అతన్ని ఎవరు స్వస్ధలానికి చేర్చారు, అసలేం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు పోలీసుల సాయంతో వారు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications