మావోయిస్టుల విధ్వంసం, కార్మికులకు గాయాలు
పాట్నా: చెప్పిన మాట విననందుకు ఒక ప్రయివేటు కంపెనీకి చెందిన ఆస్తులను మావోయిస్టులు ధ్వంసం చేశారు. మాట వినకుంటే ఇదే పరిస్థితి ఎదురౌతుందని ఆ కంపెనీ నిర్వహకులను హెచ్చరించి వెళ్లారు. మావోయిస్టుల దాడిలో 9 మంది కార్మికులకు గాయాలైనాయి.
బీహార్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బంకా జిల్లాలో బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది. సోమవారం వేకువజామున బ్రిడ్జ్ దగ్గర సుమారు 20 మంది మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. అడ్డుపడిన కార్మికుల మీద దాడి చేసి కాల్పులు జరిపారు.

ఈ దాడిలో 9 మంది కార్మికులకు తీవ్రగాయాలైనాయి. ముగ్గురి శరీరంలో తూటాలు దూసుకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సత్య ప్రకాష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మావోయిస్టులు చెయ్యాల్సింది చేసి అక్కడి నుండి మాయం అయ్యారు.
జిల్లా ఎస్పీ సత్య ప్రకాష్ మాట్లాడుతూ... సదరు నిర్మాణ కంపెనీ అడిగినంత విరాళం ఇవ్వనందుకు ఆ కంపెనీ ప్రతినిధిని మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారని, ఆయన కనపడకపోవడంతో విధ్వంసం సృష్టించారని చెప్పారు. రెండు ఎస్ యూవీలు, రెండు ట్రాక్టర్లు, పొక్లెయిన్, రెండు బైక్ లకు నిప్పంటించారని ఎస్పీ సత్య ప్రకాష్ వివరించారు. గాయాలైన వారు ఆసుపత్రులలో చికిత్స పొదుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications