ఏఐసీటీఈ వివాదాస్పద నిర్ణయం... ఇకపై ఇంజనీరింగ్ ప్రవేశాలకు మ్యాథ్స్,ఫిజిక్స్ తప్పనిసరి కాదు..
ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులు చదవడం తప్పనిసరి. కానీ ఈ నిబంధన విషయంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్,ఫిజిక్స్ సబ్జెక్టులను చదవడం తప్పనిసరి కాదని పేర్కొంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ విడుదల చేసిన హ్యాండ్ బుక్‌లో ఈ వివాదాస్పద నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలో నాణ్యమైన ఇంజనీర్లను తయారుచేయడంలో ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని... దీనివల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏదేని మూడు సబ్జెక్టులు...
ఇంజనీరింగ్ ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్,ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలన్న నిబంధన స్థానంలో కొత్త నిబంధనను ఏఐసీటీఈ చేర్చింది. దాని ప్రకారం ఏఐసీటీఈ పేర్కొన్న ఏదేని మూడు సబ్జెక్టులను విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. అందులో మ్యాథ్స్,ఫిజిక్స్,బయాలజీ,కంప్యూటర్ సైన్స్,కెమిస్ట్రీ,ఎలక్ట్రానిక్స్,ఐటీ,ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్,టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్,బయోటెక్నాలజీ,అగ్రికల్చర్,బిజినెస్ స్టడీస్,ఇంజనీరింగ్ గ్రాఫిక్స్,ఎంట్రపెన్యూర్‌షిప్ సబ్జెక్టులు ఉన్నాయి. వీటిల్లో ఏ మూడు సబ్జెక్టులు చదివినా బీఈ/బీటెక్‌లో ప్రవేశం ఉంటుంది. మ్యాథ్స్,ఫిజిక్స్ తప్పనిసరిగా చదవాల్సిన అవసరం లేదు.

తప్పుడు నిర్ణయమంటున్న నిపుణులు...
ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్,ఫిజిక్స్ విషయంలో ఆప్షన్‌ను విద్యార్థులకే వదిలేసిన ఏఐసీటీఈ... ఇంజనీరింగ్ కోర్సులో మ్యాథ్స్,ఫిజిక్స్ బ్రిడ్జి కోర్సును చేరుస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఏఐసీటీఈ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇంటర్మీడియట్ మ్యాథ్స్‌ను బ్రిడ్జి కోర్సు ద్వారా రీప్లేస్ చేయలేరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్‌లో ఐదో సెమిస్టర్ వరకు మ్యాథ్స్ ఉంటుందని... ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్ ఫౌండేషన్ లేకుండా ఇంజనీరింగ్‌లో విద్యార్థులు మ్యాథ్స్‌లో ఎలా రాణించగలరని ప్రశ్నిస్తున్నారు.

మ్యాథ్స్,ఫిజిక్స్ లేకుండా కుదరదు...
ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న డేటా సైన్స్,ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి కోర్సులకు మ్యాథ్స్‌పై లోతైన అవగాహన అవసరమని... కాబట్టి ఏఐసీటీఈ తమ నిర్ణయంపై పునరాలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంజనీరింగ్‌లో అన్ని కోర్సులకు మ్యాథ్స్,ఫిజిక్స్ తప్పనిసరి అని... కాబట్టి ఇంటర్మీడియట్‌లో ఆ సబ్జెక్టులను చదవాల్సిందేనని అంటున్నారు. ఆ రెండు లేకుండా సైన్స్‌ను అర్థం చేసుకోవడం కుదరదని అంటున్నారు. బయాలజికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ రంగంలోనూ మ్యాథ్స్ తప్పనిసరి అని... అలాంటప్పుడు ఇంజనీరింగ్‌కు అది క్రైటీరియా కాదని చెప్పడం సరికాదని అన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications