మనదేశంలోని భూలోక స్వర్గం గురించి మీకు తెలుసా!
మిజోరం రాష్ట్రం భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, లోయలు మరియు స్వచ్ఛమైన వాతావరణంతో ఇక్కడి ప్రకృతి ప్రయాణికులను ఆకర్షిస్తుంది. కానీ మిజోరం గురించి చెప్పాలంటే ప్రకృతి మాత్రమే కాదు, ఇక్కడి ప్రజల జీవన విధానమే ప్రత్యేకం. 'ట్వాంగ్‌లేనా' అనే భావన ఇక్కడి సమాజానికి ప్రాణం. దీనిని ఒక్క మాటలో నిర్వచించడం కష్టం.
ట్వాంగ్‌లేనా భావనతో అక్కడ ప్రజలు
పరులపై దయ, నిజాయితీ, వ్యక్తిగత స్వార్థం కంటే సమాజ శ్రేయస్సును ప్రాధాన్యత ఇవ్వడం వంటి అన్ని గుణాల సమ్మేళనమే ట్వాంగ్‌లేనా. ఇక్కడ అందరూ సమానులు. లింగ భేదం లేదు, కుల వర్గ విభేదాలు లేవు. మగ-ఆడ అనే పదాలు వారి భాషలో లేవు. 'వ్యక్తి' అనే పదమే ఉపయోగిస్తారు. మహిళలు సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. వ్యాపారాల్లో 70 శాతం మహిళల చేతుల్లోనే ఉంటాయి.

ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసినా ఒకరికొకరు సాయంగా
చాలా దుకాణాల్లో షాప్‌కీపర్ కూడా ఉండరు. కావాల్సిన వస్తువులు తీసుకుని ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఉచితంగా ఇచ్చే మంచి హృదయాలు ఇక్కడ ఉన్నాయి. బిచ్చగాళ్లు కనిపించడం అరుదు. సమాజ సహాయక భావన ఇక్కడ చాలా బలంగా ఉంది. ఇంటి నిర్మాణం, వివాహాలు వంటి పనుల్లో ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒక్కరు తప్పు చేస్తే అది అందరి తప్పుగా భావిస్తారు. అందుకే ఇక్కడి భాషలో తిట్లు లేవు.
ట్రాఫిక్ రూల్స్, పరిశుభ్రత ఏదైనా సరే వారే స్పెషల్
ఎక్కడైనా వస్తువులు మరచిపోయినా ప్రజలే ఫోటో తీసి వాట్సాప్‌లో పంపి తిరిగి ఇచ్చేస్తారు. దీని వల్ల మిజోరం నేరాలు అతి తక్కువగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. పరిశుభ్రత వారి జీవన విధానంలో భాగం. చెత్త కనిపించగానే ఎవరైనా తొలగిస్తారు. పాఠశాల విద్యార్థులు శనివారాలు వీధులు శుభ్రం చేస్తారు. ట్రాఫిక్ నియమాలు కఠినంగా పాటిస్తారు. హారన్ మోగించడం, ఓవర్‌టేక్ చేయడం నేరంగా పరిగణిస్తారు. రాత్రి 9 గంటల తర్వాత లైట్లు ఆపి నిద్రించే సంప్రదాయం కూడా ఉంది.
98.2 శాతం అక్షరాస్యతతో కేరళ తర్వాత రెండవ స్థానంలో మిజోరం
1987లో రాష్ట్రంగా ఏర్పడిన మిజోరం 98.2 శాతం అక్షరాస్యతతో కేరళ తర్వాత రెండవ స్థానంలో ఉంది. ఈ సమాజ బలం, ప్రకృతి అందాలు మిజోరంను భూలోక స్వర్గంగా చేశాయి. పర్యాటకులు ఇక్కడి సామరస్యపూర్వక జీవన విధానానికి ఆకర్షితులవుతున్నారు. మిజోరం మనందరికీ ప్రకృతి ప్రేమ, సమానత్వం, సమాజ సేవ గురించి నేర్పే గొప్ప ఉదాహరణ.













Click it and Unblock the Notifications