కాళ్లు మొక్కొద్దు, సభకు రండి: ఎంపీలకు మోడీ సూచన
హైదరాబాద్: బిజెపి పార్లమెంటు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన సూచనలు చేశారు. కాళ్లు మొక్కే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు. తన కాళ్లు గానీ ఇతర నాయకుల కాళ్లు గానీ స్పృశించవద్దని ఆయన చెప్పారు. కింది స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ వ్యవహారంపై నీలినీడలు అలుముకోకుండా చూడాలని ఆయన సూచిచారు.
బిజెపి ప్రతిపక్షంలో లేదని, పార్టీ పార్లమెంటు సభ్యులపై పెద్ద బాధ్యత ఉందని, ప్రభుత్వ సందేశాన్ని క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్లి కార్యక్రమాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన శుక్రవారం 20 నిమిషాల పాటు ప్రసంగించారు.

కొత్త పార్లమెంటు సభ్యులు మోడీ కాళ్లు మొక్కుతున్నారని, కష్టపడి పనిచేయాలని వారికి మోడీ చెబుతున్నారని సమాచారం. సభ సజావుగా జరగడానికి సహాయం చేయాలని, క్రమం తప్పకుండా సభకు రావాలని ఆయన సభ్యులకు సూచించారు. సభలో హుందాగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. విషయ పరిజ్ఝానంతో సభకు రావాలని, చర్చలో పాల్గొనడానికి ముందు కసరత్తు చేయాలని ఆయన చెప్పారు.
సామాన్యుల సంక్షేమానికి కృషి చేయాలని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ పార్లమెంటు సభ్యులకు సూచించారు. కొత్త సభ్యులకు బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానం పలికారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని, సామాన్యుల ప్రగతి పాటుపడాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications