రైతులకు షాక్: గాంధీ బొమ్మ లేని రూ. 2000 నోట్లిచ్చిన బ్యాంక్!
చేతికందిన కొత్త రూ.2000 నోట్లను చూసిన రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. ఆ నోట్లపై జాతిపతి మహాత్మాగాంధీ బొమ్మ లేదు.
భోపాల్: చేతికందిన కొత్త రూ.2000 నోట్లను చూసిన రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. ఆ నోట్లపై జాతిపతి మహాత్మాగాంధీ బొమ్మ లేదు. దీంతో వెంటనే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి అధికారులకు ఆ నోట్లను చూపించి తమ సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని ఓ ఏజెన్సీ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోట్లు తీసుకున్నారు. అయితే, తొలుత కొత్త నోట్లేగా చూసుకోవాల్సిన పనేముందనుకొని ఇంటికెళ్లారు.

అనంతరం చూసుకోగా వాటిపై గాంధీ బొమ్మ కనిపించలేదు. దీంతో అవి దొంగనోట్లు అనుకొని తిరిగి బ్యాంకు వద్దకు తీసుకురాగా వాటిని తనిఖీ చేసిన అధికారులు అవి దొంగనోట్లు కాదని, ఆర్‌బీఐ నోట్లేనని, వాటిని తీసుకొని తిరిగి వారికి వేరే నోట్లు ఇచ్చారు.
అయితే, ముద్రణలో లోపం వల్ల గాంధీ బొమ్మ నోట్లపై ముద్రితం కాలేదని బ్యాంకు అధికారులు చెప్పారు.
గాంధీ బొమ్మ ముద్రించాల్సిన చోట తెల్లగా వచ్చిందని, దీన్ని తిరిగి రిజర్వు బ్యాంకుకు పంపిస్తామని ఎస్బీఐ మేనేజరు శ్రావణ్ లాల్ చెప్పారు. గతంలోనూ హోషంగాబాద్ ప్రభుత్వ సెక్యూరిటీ ప్రెస్‌లో ముద్రించిన రూ.500 నోటుపై సెక్యూరిటీ థ్రెడ్ రాలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం నోట్ల ముద్రణను వేగిరం చేసిన నేపథ్యంలో ముద్రణలో పలు లోపాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications