ఐదు రోజులు ఉరికి రిహార్సల్: ముద్దు పెట్టానన్న యజమాని
ముంబై: యజమాని లైంగిక వేధింపులకు తాళలేక, ఆ వేధింపులను అవమానంగా భావించి నలుగురు కుటుంబ సభ్యులు ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్న ముంబై ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఉరి వేసుకోవడానికి పక్కా ప్రణాళిక వేసుకున్నారని, ఉరేసుకోవడానికి ముందు ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు తీశారని మిడ్‌డే పత్రిక రాసింది.
ఉరి వేసుకోవడానికి ఐదు రోజుల ముందే తమ చివరి మాటలను రికార్డు చేశారని, ఐదు రోజుల పాటు రిహార్సల్ చేశారని పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓషివారాలోని యజమాని ఫ్లాట్‌లో భారతి బాల్ (25), ఆమె సోదరుడు సోమనాథ్ కార్తిక్ పాల్ (20) ఉరి వేసుకున్నారు. ఉరి వేలాడుతున్న వారి శవాలను పోలీసులు ఫిబ్రవరి 20వ తేదీన కనిపెట్టారు. ఆ తర్వాతి రోజు ఉదయం వారి తల్లి (శిఖా పాల్), సవతి తండ్రి (మనోజ్ అజిత్ కుమార్ పాల్) అదే రీతిలో లోకాండ్వాలాలోని తమ అపార్టుమెంటులో ఉరి వేసుకుని కనిపించారు.
జనవరి 15వ తేదీన వారు ఓ మొబైల్ ఫోన్ కొన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం పాటు వీడియోలో తమ సూసైడ్ నోట్‌ను రికార్డు చేశారు. ఆ మొబైల్ ఫోన్ తల్లి శవం వద్ద కనిపించింది. తన యజమాని టింకూ సింగ్ తరుచుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడని భారతి ఆ వీడియోలో చెప్పింది. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది.

ఆమె సోదరుడు కూడా అదే విషయం చెప్పాడు. సింగ్ తనను కొడుతూ ఉండేవాడని అతను చెప్పాడు అసభ్యప్రవర్తనకు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పోలీసులు టింకూ సింగ్‌ను అరెస్టు చేశారు. సూసైడ్ నోట్స్‌ను ఆధారం చేసుకుని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాను భారతి తనకు సోదరి వంటదని, ఆమెను తాను స్పర్శించలేదని మొదట చెప్పాడు.
కానీ ఆ తర్వాత మాట మార్చాడు. తాను భారతిని ముద్దు పెట్టుకునేవాడినని, స్పర్శిస్తూ ఉండేవాడినని, అయితే లైంగిక సంబంధం మాత్రం పెట్టుకోలేదని అతను చెప్పాడు. అత్యాచారం జరగలేదని పోస్టు మార్టం రిపోర్టులో తేలినప్పటికీ ఆమె లైంగికంగా చురుగ్గా ఉన్నట్లు తేలింది.
ఆమెతో సంబంధం గురించి సింగ్ అబద్ధం చెబుతున్నాడా, ఆమెకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనే విషయాన్ని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. భారతి ఫోన్‌ను అన్ లాక్ చేసి, కాల్ రికార్డులను తనిఖీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నలుగురి ఫోన్ కాల్ రికార్డులను కూడా పరిశీలించనున్నారు. ఐదో వ్యక్తిని కూడా వారు ఆత్మహత్య వైపు నెట్టారనే అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు.
రాసుకుని సూసైడ్ నోట్స్‌ను నలుగురు కూడా చదివినట్లు కనిపిస్తోందని, ఒకరి సూసైడ్ నోట్‌ను మరొకరు రికార్డు చేసినట్లుకున్నారని మిడ్ డే రాసింది. మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తే మరిన్ని వీడియోలు బయటపడినట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్ చదవడాన్ని వారు ఐదు రోజుల పాటు రిహార్సల్ చేసినట్లు గుర్తించారు. ఫర్నీచర్, హుక్స్ వంటి విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవనం సిసిటివీ ఫొటోలను కూడా పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications