ప్రధాని మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమానికి కొద్దిసేపటి ముందు.. గన్ తో దొరికిన ఇద్దరు వ్యక్తులు
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పరిధిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వద్ద భద్రతా లోపాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకావాల్సిన ఓ కార్యక్రమానికి కొద్ది గంటల ముందు ఇద్దరు అనుమానిత వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన క్రమంలో ఈ ఘటన వెలుగుచూసింది.
నిందితుల్లో ఒకరిని రోహన్ పరేఖ్‌గా గుర్తించారు. తాను ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని, కల్చరల్ సెంటర్ లోకి అడుగు పెట్టినట్లు నిర్ధారించారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భద్రతా సిబ్బందికి అతని ప్రవర్తనపై అనుమానం కలిగింది. దీంతో అతని గుర్తింపు కార్డును పరిశీలించగా.. అది నకిలీ ఐడీగా తేలింది. అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి వద్ద ఓ తుపాకీ కూడా లభ్యమైంది. రోహన్ పరేఖ్.. అతన్ని తన బాడీగార్డ్ గా పోలీసులకు పరిచయం చేశాడు.

సరైన అనుమతి పత్రాలు లేకపోవడం, గుర్తింపు కార్డు నకిలీదని తేలడంతో వెంటనే ఇద్దరినీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం ఈ వ్యవహారంపై దర్యాప్తును ప్రారంభించింది. జియో వరల్డ్ సెంటర్‌లో నిర్వహించ తలపెట్టిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా భద్రత సిబ్బంది, పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్ పోర్ట్ నుంచి సభా వేదిక వరకు ప్రతి అంగుళాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తనిఖీలు నిర్వహిస్తోన్న సమయంలోనే నిందితులు పోలీసులు చేతికి చిక్కారు. నకిలీ పీఎంఓ గుర్తింపు కార్డు, తుపాకీతో ఎందుకు వచ్చారనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వారి వెనుక ఏదైనా నెట్‌వర్క్ ఉందా లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధంగా నకిలీ ఐడీని సృష్టించారా అనే విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది.
Mumbai Police say, "Two individuals have been detained from the venue in Mumbai where Prime Minister Narendra Modi was scheduled to attend an event. A gun was recovered from one of the individuals. The Mumbai Police detained a man at the Nita Mukesh Ambani Cultural Centre (NMACC)…
— ANI (@ANI) September 8, 2026
వారిపై ఫోర్జరీ, ఆయుధాల చట్టం కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధానమంత్రి సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. వారిని ఈ సాయంత్రం ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. పోలీసు కస్టడీకి కోరాలని క్రైమ్ బ్రాంచ్ భావిస్తోంది.













Click it and Unblock the Notifications
