నాగపూర్ టేకు.. మీర్జాపూర్ కార్పెట్లు; అన్ని ప్రాంతాల మేళవింపుగా వైవిధ్యభరితంగా పార్లమెంట్ భవనం!!
దేశ రాజధాని ఢిల్లీలో అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి, పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీక అయిన కొత్త పార్లమెంట్ భవనం ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ స్ఫూర్తిని నింపింది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన విశేషమైన వస్తువులతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం ప్రత్యేకతను సంతరించుకుంది. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి టేక్, రాజస్థాన్ లోని సర్ మధుర నుంచి ఎర్ర చలువరాయి, రాజస్థాన్లోని అంబాజీ నుంచి తెల్ల చలువరాయి, ఉదయపూర్ నుంచి కేసరియా ఆకుపచ్చ రాయి, అజ్మీర్ సమీపంలోని లఖా నుంచి ఎర్ర గ్రానైట్, రాజస్థాన్ రాతి శిల్పాలతో నూతన పార్లమెంట్ భవనం శోభాయమానంగా మారింది.

అంతేకాదు ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ నుండి కార్పెట్లు, త్రిపుర నుండి వెదురు ఫ్లోరింగ్, ముంబై నుండి ఫర్నిచర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్లోని జైపూర్ ల నుంచి అశోక చక్రానికి కావలసిన వస్తువులను సేకరించారు. లోక్ సభ మరియు రాజ్యసభ ఛాంబర్ లలో , మరియు పార్లమెంట్ యొక్క వెలుపలి భాగాలలో ఉన్న భారీ గోడలపై అశోక చక్రాన్ని రూపొందించడానికి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుండి సామాగ్రిని తీసుకువచ్చారు.
లోక్సభ, రాజ్యసభ చాంబర్లో ఫాల్స్ సీలింగ్ కోసం డయ్యూ డామన్ నుండి స్టీల్ తీసుకువచ్చారు. పార్లమెంట్ నూతన భవనం చుట్టూ ఉన్న రాతి జాలీలు రాజస్థాన్ లోని రాజ్ నగర్ మరియు ఉత్తరప్రదేశ్లోని నోయిడా నుండి సేకరించారు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కార్యకలాపాల కోసం కాంక్రీటు పనులు చేయడానికి హర్యానాలోని చక్కి దాద్రి నుండి ఇసుకను తీసుకువచ్చారు. రాతి కంకరను రాజస్థాన్ లోని కొట్ పుటాలి నుండి తీసుకువచ్చారు.
నిర్మాణంలో ఉపయోగించిన ఫ్లై యాష్ ఇటుకలు హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి తీసుకు వచ్చారు. పార్లమెంట్ నూతన భవనం లో ఉన్న ఇత్తడి పనులు, ప్రీకాస్ట్ ట్రెంచ్ లు గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి తీసుకు వచ్చారు. పార్లమెంటులో చేసిన రాతి చెక్కడం పనులను అబూ రోడ్ మరియు ఉదయ్ పూర్ నుండి వచ్చి శిల్పులు చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ వస్తువులను ఉపయోగించడం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ స్ఫూర్తిని చాటుతూ ఎన్నో ప్రత్యేకతలతో యావత్ దేశానికి ఏదో ఒక రూపంలో భవన నిర్మాణంలో ప్రాతినిధ్యం ఇచ్చారు. ఒక చారిత్రాత్మక కట్టడం గా, దేశం సగర్వంగా తలెత్తుకుని ఘనతను చాటుకునే విధంగా వైవిధ్యభరితంగా పార్లమెంట్ నిర్మాణం చేశారు.












Click it and Unblock the Notifications