మోడీ కేబినెట్: నల్లధనంపై సిట్, పోలవరంపై తర్వాత
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ మంగళవారం సాయంత్రం తొలిసారి సమావేశమైంది. సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. ఈ భేటీలో ప్రధానంగా నల్లధనం పైన చర్చించారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి రవిశంకర ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు.
విదేశాల నుండి నల్లధనాన్ని రప్పించేందుకు సిట్‌ను (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎన్.బి. షా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించే అంశం తమ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటన్నది తెలియజేస్తుందన్నారు.

ప్రత్యేక దర్యాఫ్తు బృందంలో దర్యాఫ్తు సంస్థల డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని చెప్పారు. సిట్‌లో ఆర్బీ డిప్యూటీ గవర్నర్, సిబిఐ, ఐబి, రా, ఈడి డైరెక్టర్లు, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ సభ్యులుగా ఉంటారని చెప్పారు.
పోలవరం డ్యాంపై...
కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పైన ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. తదుపరి సమావేశాల్లో దీని పైన చర్చ ఉంటుందన్నారు. తొలి సమావేశం కనుక ప్రధాన్య అంశం పైనే చర్చ జరిగిందన్నారు.
పోలవరం ముంపు ప్రాంతాల పైన ఈ కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తెచ్చే అవకాశముందని తెలిసిందని కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు ప్రశ్నించగా... తదుపరి సమావేశాల్లో పోలవరం అంశంపై చర్చ జరుగుతుందన్నారు. రేపు మరోసారి కేబినెట్ సమావేశమవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications