ఉక్రెయిన్ నుంచి భారత్‌కు నవీన్ మృతదేహం.. మెడికల్ కాలేజీకి దానం : కుటుంబ సభ్యులు నిర్ణయం
ఉక్రెయిన్ పై రష్యా దాడుల్లో చనిపోయిన భారత వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం ( మార్చి 21న ) కర్ణాటకను చేరుకోనుంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. నవీన్ మృతదేహాన్ని దేవనాగరెలోని ఎస్ఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు దానం చేయాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తన కుమారుడు వైద్య రంగానికి సహకారం అందించాలనుకున్నాడు. అందుకే నవీన్ శరీరం ఇతర విద్యార్ధులకు సహాయపడుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
ఎంబీబీఎస్ కళాశాలకు నవీన్ మృతదేహం దానం
నవీన్ కర్మకాండలు పూర్తయిన తర్వాత మృతదేహన్ని ఎంబీబీఎస్ కళాశాలకు దానం చేస్తామని అతని తండ్రి శేఖర్ గౌడ్ చెప్పారు. తన కొడుకు మృతదేహం ఆలస్యంగా రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడని చెప్పారు. కానీ దేవుడు నవీన్ ను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు బోరున విలపించారు

ఖార్కివ్ లో మృతి
ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లోని నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో నవీన్ నాల్గవ సంవత్సరం వైద్య విద్యను చదువుతున్నారు. మార్చి 1న కిరాణా సామాను కొనుగోలు చేయడానికి బంకర్ నుంచి బయటకి వచ్చారు. ఆ సమయంలో పేలుడు సంభవించి చనిపోయాడు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్లో చనిపోయిన తొలి భారతీయుడు నవీవ్.
20 రోజుల తర్వాత స్వదేశానికి మృతదేహం
ఖార్కివ్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నవీన్ మృతదేహన్ని తీసుకురావడానికి జాప్యం జరిగింది.. తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మెని నవీన్ తండ్రి అభ్యర్ధించారు. ఉక్రెయిన్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇంత కాలం మృతదేహన్ని భద్రపరిచేలా చర్యలు తీసుకుంది. ఎట్టకేలకు నవీన్ మృతదేహన్ని వార్సా నుంచి దుబాయ్ కి ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడ నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎమిరేట్స్ విమానంలో బెంగుళూరు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications