బీహార్‌లో ఎన్డీయేదే సర్కారు- నితీశ్ కాబోయే సీఎం- జేడీయూ ప్రకటన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. అందులోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. దీంతో ఎన్డీయే కూటమిలో భాగమైన నితీశ్ నేతృత్వంలోని జేడీయూను పక్కనబెట్టి బీజేపీ సీఎం పదవి తీసుకోవడం కానీ, లేక ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానీ చేస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై జేడీయూ అధికారికంగా స్పందించింది.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, నితీశ్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది.
Recommended Video
బీహార్ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ అభ్యర్ధులు ముందంజలో ఉండటంపై స్పందించిన జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎన్నో వరాలు ప్రకటించినా ప్రజలు మాత్రం వారిని నమ్మలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మరోసారి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారని వశిష్ట నారాయణ్ సింగ్ గుర్తుచేశారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ నేతలు నితీశ్ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు మరోసారి ఏర్పాటవుతుందని పలుమార్లు చెప్పారని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ తెలిపారు. మరోవైపు బీహార్‌లో ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న ప్రశ్నకు బీజేపీ బీహార్ శాఖ కార్యదర్శి సంజయ్ జైశ్వాల్ మాత్రం సమాధానం దాటవేశారు. సాయంత్రం ఐదు గంటల వరకూ వేచి చూడాలని మీడియా ప్రశ్నకు జైశ్వాల్ జవాబిచ్చారు. దీంతో ఊహాగానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications