NEET paper leak: 5 రోజుల సీబీఐ కస్టడీకి ప్రధాన నిందితులు
NEET-UG పేపర్ లీక్ కేసులో అరెస్టు అయిన మహారాష్ట్రలోని లాతూర్ పీడియాట్రిషియన్ మనోజ్ భగవాన్‌రావ్ షిరూర్, ఫిజిక్స్ ట్యూటర్ తేజస్ హర్షద్ కుమార్ షాలను మే 26 బుధవారం దిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు CBI కస్టడీకి అప్పగించింది. పెద్ద కుట్రను బయటపెట్టడానికి కస్టోడియల్ విచారణ అవసరమని న్యాయస్థానం పేర్కొంది. స్పెషల్ జడ్జి విద్యా ప్రకాష్, నిందితులిద్దరినీ ఐదు రోజులు విచారించేందుకు CBI అభ్యర్థనను ఆమోదించారు. ఈ అరెస్టులతో కేసులో మొత్తం నిందితుల సంఖ్య 13కి చేరింది. "పోలీసు కస్టడీ రిమాండ్ కోరుతూ చేసిన అభ్యర్థనను అనుమతించడానికి తగిన ప్రాతిపదికలు ఉన్నాయని కోర్టు సంతృప్తి చెందింది" అని ఉత్తర్వులో ప్రకటించింది. నిందితులను జూన్ 1న తిరిగి కోర్టులో హాజరుపరుస్తారు.
NEET పరీక్ష పేపర్ లీక్, పంపిణీలో నిందితులిద్దరి ప్రమేయంపై CBI వారిని బుధవారం అరెస్టు చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కె. పాఠక్ ప్రకారం, షిరూర్ ఈ వ్యవస్థీకృత నేరంలో "యాక్టివ్ కుట్రదారుడు". పరీక్షకు ముందు గోప్యమైన సామగ్రిని సేకరించి, పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తేజస్ షా అయితే, సహ-నిందితురాలు మనిషా హవల్దార్ నుంచి ఫిజిక్స్ ప్రశ్నలు, నోట్స్ అందుకుని, వాటిని వేరే నిందితురాలి భర్తకు పంపినట్టు ఆరోపణలున్నాయి. "నిందితులు విచారణలో సహకరించలేదు. NEET (UG) 2026 పరీక్ష ప్రశ్నలను ఎందుకు ఉపయోగించారో వెల్లడించలేదు," అని పాఠక్ తెలిపారు. ఇతర నిందితుల గుర్తింపు, డిజిటల్ ఆధారాల రికవరీ, ఆర్థిక లావాదేవీలు మరియు నెట్‌వర్క్ ఛేదనకు కస్టడీ అవశ్యకమని CBI వాదించింది.
ఎనిందితులపై ఉన్న ఆరోపణలు వారు పరీక్షా పత్రాన్ని షెడ్యూల్డ్ తేదీకి ముందే లీక్ చేయడంలో పాలుపంచుకున్న పెద్ద సిండికేట్‌లో భాగమని స్పష్టం చేస్తున్నాయని కోర్టు తెలిపింది. విచారణ ప్రాథమిక దశలో ఉందని, పోలీసు కస్టడీకి తగిన కారణాలున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతి 24 గంటలకు నిందితులకు వైద్య పరీక్షలు, కస్టడీలో పూర్తి భద్రత, సరైన ఆహారం కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. షిరూర్ న్యాయ సలహాదారుని అభ్యర్థనను మన్నించిన కోర్టు, విచారణ సమయంలో అతని న్యాయవాది కనిపించే దూరంలో, వినబడని విధంగా ఉండవచ్చని తెలిపింది.

అంతేకాకుండా, ప్రతిరోజూ సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య 45 నిమిషాల పాటు తన న్యాయవాదిని కలుసుకోవడానికి షిరూర్‌కు అనుమతి ఇచ్చింది. కాగా, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 12న రద్దు చేసింది. దీనికి సంబంధించిన పునఃపరీక్షను జూన్ 21న నిర్వహించాలని షెడ్యూల్ చేశారు.












Click it and Unblock the Notifications