గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు? 10 కిలోల ప్లాన్‌తో సామాన్యులకు ఊరట
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ గృహిణుల వంటగదిపై ప్రభావం చూపనున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) జలసంధి గుండా గ్యాస్ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈ సంక్షోభం వల్ల దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి.
ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో, తాత్కాలికంగా 10 కిలోల గ్యాస్‌ను మాత్రమే అందించేలా రీఫిల్లింగ్ సైజును తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. భారతదేశం తన ఎల్‌పీజీ (LPG) అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే పొందుతోంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో నౌకలు నిలిచిపోవడంతో దిగుమతులు తగ్గాయి. ఈ సమయంలో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

"ఒక చిన్న కుటుంబానికి 14.2 కిలోల సిలిండర్ సుమారు 35 నుండి 40 రోజులు వస్తుంది. అదే 10 కిలోల సిలిండర్ అయితే కనీసం నెల రోజులు సరిపోతుంది. దీనివల్ల మార్కెట్‌లో గ్యాస్ కొరత రాకుండా చూడవచ్చు, అదే సమయంలో చమురు కంపెనీలు తమ నిల్వలను పెంచుకోవడానికి వీలుంటుంది" అని ఒక ఉన్నతాధికారి వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా (ToI) పేర్కొంది.
వినియోగదారులకు ఊరట: తగ్గనున్న సిలిండర్ ధర!
సిలిండర్ బరువు తగ్గడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడకుండా, గ్యాస్ పరిమాణానికి తగ్గట్టుగా ధరను కూడా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 కిలోల సిలిండర్ అందుబాటులోకి వస్తే, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఆర్థికంగా సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, నెలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌కు సవాల్!
ప్రపంచ ఎల్‌పీజీ వాణిజ్యంలో మూడో వంతు హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ యుద్ధం తీవ్రమై ఈ మార్గం పూర్తిగా మూతపడితే, భారత్‌కు దిగుమతులు 30 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. అటువంటి విపత్కర పరిస్థితులు రాకముందే, ముందుస్తు జాగ్రత్తగా గ్యాస్ వినియోగంపై 'రేషనింగ్' లాంటి ఈ పద్ధతిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం నిపుణుల కమిటీ ఈ 10 కిలోల సరఫరా నమూనాను అధ్యయనం చేస్తోంది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు సామాన్యుడి పొయ్యి వెలగడానికి అడ్డంకిగా మారుతున్న వేళ, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ 'స్మార్ట్' నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఇది ఆలోచన దశలోనే ఉన్నప్పటికీ, యుద్ధం కొనసాగితే అతి త్వరలోనే మీ ఇంటికి వచ్చే ఎర్ర సిలిండర్ కాస్త తేలికగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications