అప్పుడు 'గో కరోనా గో...' ఇప్పుడు కొత్త స్లోగన్ ఇచ్చిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే...
భారత్‌లో ఈ ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'గో కరోనా గో...' అంటూ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఇచ్చిన స్లోగన్ దేశవ్యాప్తంగా పాపులరైన సంగతి తెలిసిందే. కొంతమంది దీన్ని సిల్లీగా తీసిపడేయగా... మరికొంతమంది ఫాలో అయ్యారు. తాజాగా రాందాస్ అథవాలే మరో కొత్త స్లోగన్ ఇచ్చారు. ఈసారి కరోనా కొత్త స్ట్రెయిన్‌ని తరిమికొట్టేందుకు 'నో కరోనా..' స్లోగన్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
'గతంలో నేను గో కరోనా గో స్లో ఇచ్చాను. కానీ అది నాదాకా వచ్చింది. నేనూ ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. నిజానికి అది నాదాకా రాదని అనుకున్నాను... కానీ అది ఎక్కడికైనా రాగలదని అర్థమైంది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఈసారి నో కరోనా,నో కరోనా స్లోగన్ ఇస్తున్నాను. మనకు పాత కరోనా వైరస్ వద్దూ,ఈ కొత్తదీ వద్దు...' అని అథవాలే అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు నెలల్లో భారత్‌లోనూ కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని రాందాస్ అథవాలే అన్నారు.

ఇక రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ... త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీతో పొత్తు విషయమై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథవాలేతో చర్చించనున్నట్లు చెప్పారు. బెంగాల్‌లో తాము 10 సీట్ల వరకూ సాధించగలమని అంచనా వేస్తున్నామన్నారు.
కాగా,గత అక్టోబర్ నెలలో కరోనా వైరస్ బారినపడ్డ రాందాస్ అథవాలే ముంబై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 10 రోజులకు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద గో కరోనా గో అంటూ ఆయన ఇచ్చిన స్లోగన్ చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఈ స్లోగన్‌పై విపరీతమైన ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అథవాలే ఇచ్చిన తాజా స్లోగన్‌పై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.