ఒడిశా రైలుప్రమాదం: బాలాసోర్ ప్రమాద స్థలానికి సీబీఐ బృందం; దర్యాప్తుపై ఉత్కంఠ!!
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన ఎంతో మంది జీవితాలను చిద్రం చేసింది. ఇప్పటివరకు చాలామంది మృతులను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. తమ వారి ఫోటోలు పట్టుకుని వెతుకుతూ మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. మూడు రైళ్ళు ఊహించని విధంగా డీకొన్న బీభత్స ఘటన నేపధ్యంలో దేశం ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది.
ఈ ఘటన యాదృచ్చికంగా జరిగింది కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు ఊతం ఇస్తూ రైల్వే శాఖ ఈ ఘోర ప్రమాదాల దర్యాప్తును సీబీఐ కి సిఫార్సు చేసింది. రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. రైల్వే బోర్డు సిఫార్సు మేరకు రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ప్రమాద స్థలానికి వెళ్ళి దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రయత్నిస్తున్నారు.

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మొదటి మానవ తప్పిదమే కారణమని, రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని మొదట చెప్పినప్పటికీ, తర్వాత దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాలో బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం కుట్ర అని, సిగ్నలింగ్ ట్యాంపరింగ్ వల్ల జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు చేస్తామని చెప్పడంతో అసలు ఏం జరిగింది? ఇందులో ఉన్న కుట్ర కోణం ఏమిటి? అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎవరు, ఎందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్న చర్చ జరుగుతుంది. "విధ్వంసం" మరియు రైళ్ల ఉనికిని గుర్తించే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల శుక్రవారం ప్రమాదానికి దారితీసిందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపేందుకు రంగం లోకి దిగింది. నేడు సిబిఐ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇది మానవ తప్పిదమా.. లేక సిగ్నలింగ్ వ్యవస్థ ట్యాంపరింగ్ వల్ల జరిగిన ప్రమాదమా? దీని వెనుక బాధ్యులు ఎవరు అన్న విషయాలపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టి నిజానిజాల నిగ్గు తేల్చనున్నారు.












Click it and Unblock the Notifications