వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేశంలో కరోనా థర్డ్ వేవ్: ఒమిక్రాన్ వ్యాప్తిపై ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తుందేమోననే భయందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్ కరోనా థర్డ్ వేవ్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో ఇప్పటికే పలు దేశాల్లో మూడు, నాలుగో వేవ్ ప్రారంభమయ్యాయి.
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ గరిష్టానికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ తో పెరుగుతోన్న తీవ్రతను పరిగణలోకి తీసుకుని మనదేశంలో ఈ అంచనాలను రూపొందించినట్లు పేర్కొంది.

దేశంలో థర్డ్ వేవ్ ను అంచనా వేసేందుకు గసియన్ మిశ్రమ మోడల్ అనే గణాంక పద్ధతి ద్వారా ఐఐటీ కాన్పూర్ నిపుణులు ఓ అంచనా వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రభావాన్ని చవిచూస్తోన్న అమెరికా, బ్రిటన్, జర్మనీతోపాటు రష్యా దేశాల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నారు. వీటితోపాటు భారత్‌లో ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో నమోదైన కేసుల సంఖ్యనూ వినియోగించారు. వీటన్నింటినీ క్రోడీకరించి.. 2022 ఫిబ్రవరి తొలివారం నాటికి దేశంలో థర్డ్ వేవ్ గరిష్టానికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేశారు.
వ్యాక్సినేషన్ ను పరిగణలోకి తీసుకోనందున ఆ సమయం నాటికి ఎన్ని కేసులు వస్తాయనే విషయాన్ని మాత్రం అంచనా వేయలేదని తెలిపారు. డిసెంబర్ 15, 2021 నుంచి నమోదైన కేసులు.. ఫిబ్రవరి 3, 2022 నాటికి గరిష్టానికి చేరుకునే అవకాశం ఉందని కాన్పూర్ ఐఐటీ అధ్యయనం పేర్కొంది. సమీక్ష కోసం ఓ జర్నల్ లో ఉంచిన ఈ అధ్యయనానికి ఐఐటీ కాన్పూర్ లోని మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ విభాగానికి చెందిన సరాబా పర్షాద్ రాజేశ్ భాయ్, సుభ్రాశంకర్ ధర్, శలభ్ లు ఈ అథ్యయనం చేపట్టారు.
కాగా, దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈ బృందం.. 100 శాతం అర్హులకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యా దేశాల్లో మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్ అందినప్పటికీ అక్కడ థర్డ్ వేవ్ ను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని రానున్న పరిస్థితులకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications