పంజరంలో పక్షిని కాదు.. స్వేచ్చగా తిరగాలి: అమిత్ షా ఆఫర్ తిరస్కరించిన ఓవైసీ
ఇటీవల యూపీలో అసదుద్దీన్ కాన్వాయ్‌పై జరిగిన కాల్పులు కలకలం రేపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు జెడ్ క్యాటగిరీ భద్రత కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా రిక్వెస్ట్ చేశారు. కానీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. తనకు భద్రత వద్దు అని.. తాను స్వేచ్చగా ఉండాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు.

22 మంది కన్నా ఎక్కువేం కాదు..
భద్రత తీసుకోవాలని తనను అమిత్ షా కోరారని అసద్ తెలిపారు. తన ఒక్కని ప్రాణం.. సీఏఏ కోసం చేసిన ఆందోళనలో చనిపోయిన 22 మంది కన్నా ఎక్కువ కాదని చెప్పారు. పదుల సంఖ్యలో జనం చనిపోయారని ఉదహరించారు. అంతేకాదు తన చుట్టూ సాయుధులయిన పోలీసులు ఉండటం ఇష్టపడని చెప్పారు. తాను పంజరంలో చిలుక కాదని కామెంట్ చేశారు. తాను స్వేచ్చగా బతకాలని అనుకుంటున్నాని స్పష్టంచేశారు.

కాల్పుల కలకలం
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఒవైసీ కారుపై గురువారం కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అసదుద్దీన్‌కి తక్షణమే సీఆర్‌పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. జెడ్ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉండనున్నారు. తనపై కుట్ర పన్నారని, కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని అసదుద్దీన్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తామని చెప్పింది. కానీ దానిని అసద్ తిరస్కరించారు.

ఫాలొ అయ్యారు.. ఇదిగో ఫుటేజీ
అసదుద్దీన్ ఒవైసీపై దాడి చేసిన నిందితులు గత కొన్ని రోజులుగా ఆయన్ను వెంటాడారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సభలు, ర్యాలీల్లో అసదుద్దీన్ చేసిన ప్రసంగాలతో విసిగిపోయిన నిందితులు సచిన్, శుభం ఒవైసీపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితులు మీరట్ ర్యాలీతోపాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు హాజరై, దాడికి పథకం పన్నారని సమాచారం. ఒవైసీపై దాడి చేసిన నిందితులు మీరట్ ర్యాలీలో పాల్గొన్నారనే సమాచారంతో పోలీసులు ర్యాలీకి సంబంధించిన సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని వెంబడిస్తున్నారని, అయితే ఆయనపై దాడి చేసే అవకాశం రాలేదని పోలీసులు చెప్పారు.

అసద్ ప్రసంగాలు అంటే సచిన్‌కు కోపం
మీరట్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఒవైసీ వాహనం టోల్ గేటు వద్ద ఆగింది. అవకాశం కోసం చూసి నిందితులు ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపారు. సచిన్, శుభం సైద్ధాంతికంగా తీవ్రవాద స్వభావం ఉన్నవారని పోలీసు అధికారులు చెప్పారు. నిందితుల్లో ఒకరైన సచిన్ మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ప్రసంగాలపై చాలా కోపంగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. సచిన్ కొద్ది రోజుల క్రితమే కంట్రీ మేడ్ పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సచిన్‌కు ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒవైసీపై కాల్పులు జరిపిన తర్వాత నిందితులిద్దరు గుంపు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications