భారత్ కంటే ఎక్కువే: అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటున్న పాక్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్ కంటే కూడా దాయాది దేశం పాకిస్థాన్ వద్ద పదికి పైగా అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని అణుశాస్తవ్రేత్తల బులెటిన్ వెల్లడించింది. రెండు దేశాలు కూడా 2007 నుంచి పోటాపోటీగా అణ్వాయుధాలను పెంపొందించుకుంటూనే ఉన్నాయని పేర్కొంది. 1987 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర దేశాల కార్యక్రమాలను ఈ బులెటిన్ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది.
ప్రపంచంలో ఏ దేశం వద్ద ఏ రకమైన అణ్వాయుధాలున్నాయి, వాటి సామర్థ్యం అన్న దానిపై విశ్లేషణ జరిపింది. 1997 వరకు కూడా భారత్ వద్దగానీ, పాక్ వద్దగానీ అణ్వాయుధాలు లేవనీ, కానీ ఆ మరుసటి సంవత్సరమే ఈ రెండు దేశాలు అణుపరీక్షలు జరిపాయని తెలిపింది. అప్పట్లో భారత్ వద్ద మూడు అణ్వాయుధాలుంటే పాకిస్తాన్ వద్ద ఒకటే ఉండేదని, కానీ 1999 నాటికి ఈ రెండు దేశాలు ఎనిమిది అణ్వాయుధాలను సముపార్జించుకున్నాయని వెల్లడించింది.

2000 సంవత్సరం నాటికి 14 అణ్వాయుధాలను భారత్ సమకూర్చుకుంటే.. పాకిస్థాన్ 13 అణ్వాయుధాలను సమీకరించుకుందని తెలిపింది. 2007లో భారత్ వద్ద 50 ఆణ్వాయుధాలుంటే పాకిస్తాన్ వద్ద 60 ఉన్నాయని, అప్పటినుంచి ప్రతి ఏటా పదికి పైగా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చాయని తెలిపింది. ఇక 2013 నాటికి భారత్ 110 అణ్వాయుధాలను కలిగివుంటే, పాకిస్తాన్ వద్ద వీటి సంఖ్య 120కి పెరిగిందని ఈ బులెటిన్ తెలిపింది.
చైనా కూడా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చిందని, అయితే మిగతా దేశాల వేగంతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలోనే వీటి సముపార్జన జరిగిందని తెలిపింది. 2013 నాటికి చైనా వద్ద 250 అణ్వాయుధాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచంలో ఇప్పటికి అత్యధిక స్థాయిలో అమెరికా వద్ద 4,804 అణ్వాయుధాలున్నాయని, 4,480 అణ్వాయుధాలతో రష్యా రెండో స్థానంలో ఉందని తెలిపింది.
పాక్ క్షిపణి షాహీన్-3 పరీక్ష విజయవతం
భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి షాహీన్-3ని పాక్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ, వార్‌హెడ్లు మోసుకుపోయే సామర్థ్యం గల ఈ క్షిపణి 2,750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది.
షాహీన్-3 క్షిపణితో పాక్ రక్షణ రంగం బలోపేతమవుతుందని సైనిక వ్యూహాత్మక ప్రణాళికల విభాగం డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జుబేర్ మహమూద్ హయత్ పేర్కొన్నారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నవాజ్ షరీఫ్, అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేస్తూ.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications