యువకుడ్ని చెంపదెబ్బ కొట్టిన దిల్లీ మంత్రి పర్వేశ్ వర్మకు పోలీసులు షాక్..
దేశ రాజధాని దిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్ వర్మ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా తిలక్ నగర్ లోని రోడ్డు తనిఖీల్లో భాగంగా ఆయన అక్కడ ఓ యువకుడి చెంపపై కొట్టిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంత్రి పర్వేశ్ వర్మపై నాన్- కాగ్నిజబుల్ రిపోర్ట్(NCR) ను నమోదు చేశారు. సెప్టెంబర్ 27 ఆదివారం రోజున పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ లో రోడ్డు నాణ్యతను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింతగా ముదిరింది. మరోవైపు దిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇక దిల్లీ మంత్రి పర్వేశ్ వర్మపై నాన్- కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదైన విషయంలో ఆయన ఉద్దేశపూర్వకంగానే యువకుడిపై దాడికి పాల్పడ్డాడని గ్రహించి భారతీయ న్యాయ సంవిధాన్ చట్టం ప్రకారం సెక్షన్ 115 కింద ఎన్సీఆర్ నమోదు చేసింది. బాధితుడు సాహిబ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే NCR నమోదు చేసినంతమాత్రాన వెంటనే దర్యాప్తు ప్రారంభం కాదు. ఎఫ్ఐఆర్ మాదిరి కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేయాలంటే మేజిస్ట్రేట్ నుంచి అనుమతి ఉండాలి. అలాగే ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు ఎట్టిపరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయడానికి వీలు లేదు.

ఇక ఈ ఘటన ఆదివారం జరగ్గా.. ఘటన సమయంలో రోడ్డు పనుల తనిఖీలో భాగంగా తిలక్ నగర్ నియోజకవర్గంలో దిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ పర్యటించారు. ఆయన వెంట తిలక్ నగర్ ఆప్ ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ కూడా ఉన్నారు. అయితే రోడ్డు నాణ్యతపై ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తనను వీడియో తీస్తున్న ఓ యువకుడి ఫోన్ లాక్కోవడమే కాకుండా అతడి చెంప చెల్లుమనిపించారు మంత్రి పర్వేశ్ వర్మ. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
